అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని కార్చిచ్చు చల్లారడం లేదు. మంటలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని చిన్న మంటలను అదుపు చేసినా .. పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లో వ్యాపించిన మంటలను మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఈ మంటల కారణంగా 24 మంది మరణించారని చెబుతున్నారు. కార్చిచ్చు వేలాది ఇళ్లను కాల్చి బూడిద చేసింది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యమని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ చెప్పారు.
లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుకు సంబంధించిన 10 విషయాలు
1..ఆరు రోజులుగా లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. వారాంతం నాటికి మృతుల సంఖ్య 24కి చేరింది. 8 మంది పాలిసాడ్స్ ఫైర్ జోన్‌లో, 16 మంది ఈటన్ ఫైర్ జోన్‌లో మృతి చెందినట్టు గుర్తించారు.
2..1990వ దశకంలో బ్రిటిష్ టీవీ షో “కిడ్డీ కాపర్స్”లో కనిపించిన మాజీ ఆస్ట్రేలియన్ బాలనటుడు రోరీ సైక్స్ మృతుల్లో ఉన్నట్లు గుర్తించారు.
3.. పాలీసాడ్స్ ప్రాంతంలో 23,600 ఎకరాల్లో విస్తరించిన మంటలు 11 శాతం అదుపులోకి రాగా, ఏటోన్ ప్రాంతంలోని 14వేల ఎకరాల్లో 15 శాతం అదుపులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని శాన్ ఫెర్నాండో లోయలో మంటలు చెలరేగడంతో ఫైర్ టోర్నడోని గుర్తించారు.
4.. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 12,000 కంటే ఎక్కువ నిర్మాణాలు ఆహుతయ్యాయి. లక్ష మందికి పైగా ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆర్థిక నష్టం $135 బిలియన్ల నుండి $150 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
5.. తమ ఇళ్లను కోల్పోయిన డజ్లన మంది యాక్టర్లలో ఆంథోనీ హాప్‌కిన్స్, ప్యారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ కూడా ఉన్నారు.
6.. అగ్ని మాపక సిబ్బందికి ఈ వారాంతంలో తాత్కాలిక విరామం లభించింది. హరికేన్ శక్తికి చేరుకున్న శాంటా అనా గాలులు చివరకు తగ్గడంతో వారికి విశ్రాంతి ఇచ్చారు.
7..అయితే ఆదివారం రాత్రి నుంచి బుధవారం వరకు గాలులు మళ్లీ పుంజుకుంటాయని, గంటకు 96 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
8.. నగరాన్ని పునర్నిర్మిస్తామని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ 2.0ని నిర్మించడానికి ఇప్పటికే బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
9..అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా అధికారుల అసమర్థతపై ఆరోపణలు చేశారు. “ఇది మన దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటి. వారు మంటలను ఆర్పలేరు. వాళ్లకు ఏమైంది?” అని అన్నారు.
10.. మంటలకు కారణాలేంటో తెలుసుకోవడానికి ఫెడరల్, స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కార్చిచ్చు ఉద్దేశపూర్వకంగా జరిగే అవకాశం ఉన్నా… అవి తరచుగా సహజమైనవి. పర్యావరణ జీవిత చక్రంలో ముఖ్యమైనది.