22.5 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

రేవంత్ కేబినెట్ నుంచి ఆ ముగ్గురు ఔట్?

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల అప్పుడు ప్రజల్లో ఒక నిర్ణయానికి కూడా వచ్చేశారు. అయితే ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు వివాదాలు, విమర్శలు వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం ముగ్గురు మంత్రుల కారణంగానే వచ్చాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొదటి నుంచి ఆ ముగ్గురి పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారట. కొందరు మంత్రులు అనసవరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. వివాదాలకు కారణం అవుతున్నారని రేవంత్ భావిస్తున్నారట. అందుకే ఈ సారి కేబినెట్ విస్తరణలో ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి.. కొత్త వారికి చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు తమ శాఖలపై కూడా పట్టు సాధించలేకపోయారట. పైగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణం అవుతున్నారట. ఇప్పటికే వీరిని తొలగించే విషయమై పార్టీ హైకమాండ్‌తో కూడా రేవంత్ రెడ్డి చర్చించారని.. అటు వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. వేటు పడే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుతో పాటు మరో మంత్రి ఉన్నట్లు తెలిసింది. అయితే మూడో మంత్రి ఎవరా అని కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ ముగ్గురిని తొలగించడం వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కేడర్ ఏమైనా వ్యతిరేకించే అవకాశం ఉందా అనే విషయాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక సర్వే కూడా చేయించినట్లు తెలిసింది. కాగా.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న వారిని తొలగించడమే మంచిదనే అభిప్రాయం కేడర్‌లో ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన మంత్రిగా కొండా సురేఖ ముద్రపడ్డారు. మొదటి నుంచి ఆమె వ్యవహార శైలి కాస్త దురుసుగానే ఉండేది. అయితే ఇటీవల ఆమె చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రజల్లో కూడా ఆమె వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖా అతి జోక్యం కారణంగా ఇతర ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో ఉన్న విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వీరిద్దరి కలహాల కారణంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైంది.

ఒక ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన వివాదం ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంత్రి హోదాలో సర్థి చెప్పాల్సిన కొండా సురేఖ.. ఏకంగా స్టేషన్‌లోనే పంచాయితీ పెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరో వైపు ఆమె ఇంచార్జి మంత్రిగా ఉన్న మెదక్ జిల్లాలో కూడా తరచుగా వివాదాలు చెలరేగుతున్నాయి. పైగా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు సురేఖ పెద్దగా కృషి చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలన్నీ గమనించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారట. వాస్తవానికి సమంత విషయంలో వ్యాఖ్యలు చేసిన సమయంలోనే ఆమెను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పటికి వివాదం సద్దుమణగడంతో ఎలాంటి చర్య తీసుకోలేదట. కానీ ఈ సారి మాత్రం ఆమెకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది.

ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే హోదాలో జూపల్లికి మంత్రి పదవి దక్కింది. అయితే ఆయన ఆశించిన మేర పని చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. జూపల్లి పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా జూపల్లి సమన్వయం చేసుకోలేక పోతున్నారని.. ఆయన వైఖరి పట్ల జిల్లా నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇక జూపల్లి తన శాఖపై పట్టు కోల్పోయారని.. ఇటీవల యూబీ గ్రూప్ తెలంగాణ నుంచి కింగ్ ఫిషర్ బీర్లను ఉపసంహరించుకున్న వ్యవహారాన్ని సరిగా డీల్ చేయలేకపోయారని రేవంత్ భావిస్తున్నారట.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ఎప్పటి నుంచో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఒక వేళ జూపల్లి కృష్ణారావును కేబినెట్ నుంచి తప్పిస్తే ఆ స్థానంలో వాకాటిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణలో ఎవరిని ఉంచుతారు? ఎవరికి చోటు కల్పిస్తారనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్