ప్రపంచంలో తగ్గడం, తలదించుకోవడం అంటే తెలియనివి రెండే రెండు ఉన్నాయి. అవి ఒకటి రియల్ రంగం. రెండోది సువర్ణం ధరలు. మొదటిదాని మాట అలా ఉంచితే.. స్వర్ణ, రజితాలు శుభకార్యాలు, వివాహాలు వచ్చాయంటే ఎగిరి గెంతులు వేస్తాయి. తమ ధరలను ఆకాశానికి చేర్చేసి…కింది చూపలు చూడమని తేల్చి చెప్పేస్తాయి. ఇదుగో ఇప్పుడు ఈ నెలలో ఏకంగా 14 పెళ్లి ముహూర్తాలుంటే.. ఇంక బంగారం, వెండి ధరలు ఎవరి మాట వింటాయి. కొండెక్కి కూర్చోవడం తప్ప నేల చూపులు ఎందుకు చూస్తాయి. ఇక విషయంలోకి వస్తే.. ఫిబ్రవరి ఏడో తేదీ, మహలక్ష్మీ ప్రియవారం శుక్రవారం నాడు దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79 వేల 310 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 86 వేల 520 రూపాయలుగా ఉంది.
ధగధగా మెరిసేపోతున్న బంగారం ధర ఇప్పట్లో తగ్గేలాలేదు. మార్కెట్లో దూసుకెళుతున్న స్వర్ణం ధర పెరుగుదల ఇప్పట్లో ఆగేలానూ కనిపించడం లేదు. ప్రతి కొత్త రోజుతో సింగారించుకుంటున్న బంగారం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డాలర్ పతనం, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, దేశీయ స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతుతో ఎంసిఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫోర్ కాంట్రాక్ట్ తొలి సారిగా 84 వేల రూపాయల స్థాయిని దాటింది. అయితే, ప్రస్తుతం తులం బంగారం ధర 86 వేల రూపాయలను దాటేసింది.
కేంద్ర బడ్జెట్ తర్వాత కాస్త తగ్గినట్టు అనిపించినా అనంతరం రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు పరిణయ ముహూర్తాల కారణంగా.. సువర్ణం, రజితం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులుగా వరుసగా బంగారం ధరలు పెరిగిపోతూ.. సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ మూడు రోజుల్లో తులం బంగారం ధర దాదాపు 2500 రూపాయలు పెరిగింది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు అనగానే తొలుత గుర్తుకు వచ్చేది స్వర్ణ, రజితాలే అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే బంగారు, వెండి మన సంస్కృతి, సంప్రదాయాలతో అంతగా ముడిపడిపోయాయి. క్లిష్ట సమయాల్లో ఆర్థిక భరోసాగా, పెట్టుబడిగా బంగారం ఉపయోగపడుతుంది. బంగారం తరువాత తాను ఈ రీతిలో ఉపయోగపడతానని వెండి చెబుతోంది. అందుకే..ఈ ధర కొంతగా పరుగులు పెడుతోంది.
పెళ్లి ముహూర్తాలు, శుభకార్యాల వల్ల బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చోవడం కామనే అయినా..అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు, గిరాకీ తదితర ఎన్నో కారణాలు ఈ ధరలు పెరిగేందుకు కారణం అవుతోందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పరిశీలిస్తే…అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు సరికొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,860 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 32.24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియన్ రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనమవుతూ ఆందోళన కలిగిస్తోంది.
ఏపీ, తెలంగాణలోని ముఖ్య పట్టణాల్లో ధరలు పరిశీలిస్తే.. శుక్రవారం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 250 రూపాయలు పెరిగి 79 వేల 300 రూపాయల వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 270 రూపాపయలు పెరిగి 86 వేల 510 రూపాయలకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగి 79 వేల 300 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రేటు తులంపై 270 రూపాయలు పెరిగి 86 వేల 510 రూపాయల వద్దకు చేరుకుంది. విశాఖపట్నంలో 22 క్యారెట్లు, తులానికి 250 రూపాయలు పెరిగి 79 వేల 300 రూపాయల వద్దకు చేరుకుంది. బిస్కెట్ బంగారం రేటు తులానికి 270 రూపాయలు పెరిగి 86 వేల 510 వద్ద ట్రేడవుతోంది. బంగారం రేటు ఇలా రెచ్చిపోతుంటే, తానేం తక్కువ కాదని వెండి రేటు పరుగులు పెడుతోంది. కిలో వెండి రేటు లక్ష రూపాయల పైనే కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ సహా ఏపీలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 1,07,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.