స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ తరపున అతిథిగా హాజరయ్యారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చెర్రీకి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం జీ-20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్న చరణ్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు కూడా వేశారు.
ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెర్రీకి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు. అనంతరం వేదికపై పలు అంశాల గురించి చరణ్ మాట్లాడారు. ఈ వేదికకు తనను ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.