ఫార్ములా ఈ రేసు కేసులో గురువారం మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. విచారణ ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచరణ చేపట్టింది. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని న్యాయవాది కోరారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. లాయర్ లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని ఈ సందర్భంగా ఏఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదితో కలిసి గురువారం ఏసీబీ విచారణకు వెళ్లాలని న్యాయస్థానం కేటీఆర్‌కు సూచించింది. గురువారం విచారణ తర్వాత ఏవైనా అనుమానాలుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు తెలిపింది.