మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మెటా కంటెంట్ కు సంబంధించిన విధి విధానాల్లో మరింత ఉదారంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ తో పాటు థ్రెడ్ యాప్‌లలో పోస్టు చేసే కంటెంట్ లో ఇకనుంచి ఉదారంగా వ్యవహరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ప్రపంచంలో ఎవరైనా, అనేక అంశాలపై తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పిస్తామన్నారు ఆయన. అంతేకాదు ఎలన్ మస్క్ ఎక్స్ వేదిక స్ఫూర్తితో కొత్తగా కమ్యూనిటీ డ్రైవెన్ అప్రోచ్ తో ముందుకెళతామని మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడిమో మెస్సేజ్ విడుదల చేశారు.
గతంలో ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించేవారన్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు ఇందుకు వేదికగా నిలిచాయని ఆయన అన్నారు. అయితే కాలక్రమంలో స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించడానికి ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రజల మంచి కోసం అలాగే ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎవరైనా పోస్టులు పెడితే వాటిని పాలకులు అడ్డుకుంటున్నారని జుకర్ బర్గ్ మండిపడ్డారు. ఇటువంటి పాలకుల దుశ్చర్యలు, కుట్రలకు తెరదించాల్సిన సందర్భం వచ్చిందన్నారు జుకర్ బర్గ్ .
ఈ సందర్భంగా 2019లో తన జార్జ్‌టౌన్ ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. జార్జ్‌టౌన్ ప్రసంగంలో సామాజిక మాధ్యమాలు, భావ వ్యక్తీకరణకు పెద్ద పీట వేయాలని మార్క్ జుకర్‌బర్గ్ కోరారు. భావ వ్యక్తీకరణ తోనే వాస్తవాల వెల్లడి సాధ్యమని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
కాగా ఇప్పటివరకు మెటా కంపెనీకి ఫ్యాక్ట్ ఫైండింగ్ సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. ప్రభుత్వాలకు అలాగే దేశాధినేతలకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెడితే, ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ సిస్టమ్ ముందుగా వాటిని చెక్ చేస్తుంది. ఏదో ఒక వంకతో సదరు పోస్టులను సర్క్యులేట్ కాకుండా చూస్తుంది.
కాగా ఆన్‌లైన్ కంటెంట్‌లో ఇటీవల వచ్చిన పెను విప్లవం గురించి ఆయన ప్రస్తావించారు. ఆన్‌లైన్ కంటెంట్ గురించి కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు. ఆన్‌లైన్ కంటెంట్ ను నియంత్రించడానికి సెన్సారింగ్ వ్యవస్థను ప్రభుత్వాలు ముందుకు తీసుకువచ్చాయని జుకర్‌బర్గ్ మండిపడ్డారు. అయితే మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదంతో పాటు పిల్లల పట్ల లైంగిక వేధింపుల విషయంలో అందరూ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
భావ వ్యక్తీకరణ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెన్సార్ షిప్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు జుకర్ బర్గ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూరప్‌లోని అనేక దేశాల్లో సెన్సార్ షిప్ విధించడానికి అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని జుకర్ బర్గ్ వెల్లడించారు. అగ్రరాజ్యమైన అమెరికా సాయంతోనే సెన్సార్ షిప్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయగలనని తాను భావిస్తున్నట్లు జుకర్ బర్గ్ పేర్కొన్నారు.