స్వతంత్ర వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఏడాది నిరవహిస్తున్న మహానాడు కార్యక్రమం ప్రత్యేకమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేడర్ లో ఉత్సాహం పెరిగిందని.. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ పోదామని తెలుగు తమ్ముళ్లకు జోష్‌ని నింపారు చంద్రబాబు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనను తెలుగు జాతి స్మరించుకుందని తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.
ఇది చారిత్రిక మహానాడు.. ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి.. మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం అని గుర్తు చేశారు. తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం అని సంకల్పం తీసుకుందామని.. తెలుగు దేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది, టీడీపీ పార్టీ ఎంబ్లమ్‌లో నాగలి, చక్రం, ఇల్లు పెట్టారని.. రైతులను శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలని నాడు నాగలి పెట్టారు.. శ్రమ జీవుల కోసం చక్రం పెట్టారు.. పేదల కోసం ఇళ్లు పెట్టారని వివరించారు. తెలుగు దేశం సింబల్ సైకిల్.. ముందు చక్రం అంటే సంక్షేమం.. రెండో చక్రంఅభివృద్ది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది.. దాంతో ఇక దూసుకుపోవడమే అంటూ నాయకులకు, కార్యకర్తలకు ఫుల్ జోష్ నింపారు.
అందరితో చర్చించిన తర్వాత ఆదివారం మేనిస్టోలో ఫేజ్ 1 ప్రకటిద్దామని ప్రకటించారు. ప్రజలు మెచ్చేలా.. అదిరిపోయే సంక్షేమం చేద్దామన్నారు. రాజమహేంద్రవరం అదిరిపోయింది.. ఆదివారం దద్దరిల్లి పోతుంది అన్నారు. రాష్ట్రంలో ఉండే అందరి చూపూ రాజమండ్రి పైనే.. అన్ని రోడ్లూ రాజమండ్రి వైపే వస్తాయన్నారు. 2024లో ఎన్నికలు వచ్చినా.. అంతకంటే ముందు వచ్చినా సిద్దమేనన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా మార్చే సత్తా తెలుగు దేశం పార్టీకే ఉంది అన్నారు. వచ్చేది కురుక్షేత్రం.. ఆ యుద్దంలో వైఎస్సార్‌సీపీ కౌరవ సేనను ఓడిద్దాం.. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదామన్నారు.