విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించే క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి నల్లేరుపై నడకనే చెప్పాలి. విశాఖ జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో వైసీపీకి క్లీన్ మెజారిటీ ఉంది. కానీ టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెడితే పరిస్థితిలో తేడా వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే కొందరు విశాఖ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లారు. ఎన్నికల వేళ ఫిరాయింపులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆగస్టు 30న జరగనున్న విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మాజీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్లు కూటమిదే అధికారం కాబట్టి ఫిరాయింపులను ఎవరూ ఆపలేరని ఒప్పుకోక తప్పని నిజం.
వైసీపీ మాత్రం తమ నేతలెవరూ ప్రలోభాలకు లొంగరని, పార్టీని అంటిపెట్టుకునే ఉంటారని ధీమాగా చెబుతోంది. ఈ ధీమా ఎన్నికల వరకు ఉండాలని.. మధ్యలో జగన్ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరూ చేజారకూడదని వైసీపీ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తేనే తమవైపు ఎవరున్నారు, ఎవరు కూటమి వైపు వెళ్లాలనుకుంటున్నారో తేలిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహరచన చేస్తుంది.
మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది.
స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అరకు, పాడేరు నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల చేరికలే టార్గెట్‌గా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జి, పీల గోవిందు, కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరో ఆరుగురి పేర్లను పల్లా శ్రీనివాస్.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు.
తమవాళ్లను కాపాడుకునే పనిలో వైసీపీ నేతలు బిజీ అయ్యారు. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకునేందుకు కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కౌన్సిల్ ఏర్పడిన దగ్గరి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ్గా.. ఒక్కసారి కూడా ఒక్క స్థానంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు గెలవలేదు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలవొచ్చని చూస్తున్నాయి ఇరు పార్టీలు.


