స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఎంతోమంది అభాగ్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఆసరగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికసాయం ప్రకటించాయి. అయితే ఈ డబ్బులు కోసం ఓ మహిళ అడ్డదారి తొక్కింది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా బహనాగ రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఓ మృతదేహాన్ని అధికారులకు చూపించి తన భర్త బిజయ్ దత్తాదే అని చెప్పి విలపించింది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేపట్టిన పోలీసులకు ఆమె అబద్ధం చెబుతుందని అర్థమైంది. దీంతో పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.
అయితే ఈ విషయం ఆమె భర్త బిజయ్ దత్తాకు తెలియడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు.. తాను బతికి ఉన్నా చనిపోయానని చెప్పినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. దాంతో అరెస్టుకు భయపడి ఆ మహిళ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాగా గత 13 ఏళ్లుగా గీతాంజలి, బిజయ్ విడివిడిగా జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి నకిలీ హక్కుదారులు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఒడిశా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పీకే జెనా ఆదేశించారు.