ఏపీలో నామినేషన్ల పర్వం పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. మరో మూడు రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనుంది. అయినా, ఇంకా టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 5 చోట్ల అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు అందరికీ కలిపి ఒకేసారి బీ ఫారాలు అందించారు చంద్రబాబు. ఇంతకీ మార్పులు, చేర్పులు జరిగిన ఆ 5 స్థానాలు ఏవి..? టీడీపీ రెబల్స్ బెడద తప్పదా..?
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫామ్స్ అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫామ్స్ పంపిణీ చేశారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు అభ్యర్థులం దరూ ఇందులో పాల్గొన్నారు. బీ ఫారం అందుకుంటున్న నేపథ్యంలో నారా లోకేశ్ తండ్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు శాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు.
వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుల్లో బాగంగా 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, కొందరి నేతలకు టికెట్లు దక్కకపోవడంతో చాలా చోట్ల అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో తాజాగా 5 చోట్ల అభ్యర్థులను మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల – బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర – ఎంఎస్ రాజు, వెంకటగిరి – కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు ఖరారు చేశారు.
రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును.. నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఇప్పటివరకూ అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొటిల్ బ్యూరోలోకి తీసుకున్నారు. అటు, పెందుర్తి సీటును మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆశించారు. కానీ పెందుర్తి సీటుని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల స్థానాన్ని కేటాయించారు. ఇక పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించగా.. మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. మరోవైపు మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే, మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు.
మరోవైపు పొత్తుల్లో బాగంగా మరో రెండు స్థానాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయిం చడంతో.. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో.. ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే అభ్యర్థులను మార్చడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్‌కుమార్‌ను తప్పించి.. MS రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. లోకల్ ముద్దు..నాన్‌లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు అల్లూరు జిల్లా రంపచోడ వరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి వంతల రాజేశ్వరి చంద్రబాబు ఫొటోతోనే ప్రచారం చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అనంతబాబు ఆరాచకాలను ఎండగడతానన్నారు. ప్రజల్లో ఉన్న తనను పార్టీ హైక మాండ్ గుర్తించకపోవడం బాధాకరమని.. కార్యకర్తల అభ్యర్థన మేరకే తారు రెబల్‌గా బరిలో దిగానని స్పష్టం చేశారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీడీపీ. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టేలా ప్లాన్ చేస్తోంది. అయితే రెబెల్స్ బెడెదతో పాటు అసమ్మతి జ్వాలలను ఎలా దారికితెస్తారు అనేది వేచి చూడాలి.