28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

సర్పంచ్ ల పదవీ కాలాన్ని పొడిగిస్తారా?

ఏ వయస్సుకు ఆ ముచ్చట అనేది సామెత. ఏ కాలంలో జరగాల్సిన ఎన్నికలు ఆ కాలంలో జరిగితే అది రాజకీయ అచ్చట. సకాలంలో ఎన్నికలు జరగకపోతే అచ్చట్లు, ముచ్చట్ల మాటా అలా ఉంచితే కొందరికి ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఉంటుంది. అయితే, ఏలిక సాగిస్తున్న వారు, ఎన్నికల అధికారులు ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలపర్వాలు సాగడం సర్వ సాధారణం. ఫిబ్రవరి 1 తో సర్పంచ్ ల పదవీ కాలం ముగుస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికలు కష్టమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. కనీసం మూడు నెలల సమయం ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ ల పదవీ కాలాన్ని పొడిగిస్తారా.? లేక ప్రత్యేక అధికారుల చేతికి పగ్గాలు ఇస్తారా.?

గ్రామీణ స్థాయి స్థానిక స్వయం పరిపాలన చట్టబద్ద వ్యవస్థే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు సర్పంచ్. యావత్ గ్రామ పాలనకు అతి ముఖ్యమైన వ్యక్తి సర్పంచ్. తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యింది. అయితే, రాష్ట్రంలో ఫిబ్రవరి 1 వ తేదీతో సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది. మరి సర్పంచ్ ఎన్నికల మాటో అంటే ఎవరి నుంచి సరియైన సమాధానం రావడం లేదు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంటే బహు కష్టం అని ప్రభుత్వ పెద్దలు పెదవి విరిచేస్తున్నారు. కనీసం మూడు నెలలైనా సమయం లేకుంటే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కష్టమనే అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును లేనట్టే అనే సమాధానం వస్తోంది.

పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే, సర్పంచ్‌ల పదవి కాలాన్ని పొడిగిస్తారా.? లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా.? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అసలే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామసీమల్లో సర్పంచ్ వ్యవస్థ లేకుంటే మరిన్ని ఇబ్బందులు రావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. గ్రామ సభలు ఏర్పాటు చేస్తే, ఆరు గ్యారంటీలే కాకుండా ఇతర హామీలపైన ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కారణంగానే పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేస్తోందని గ్రామ సర్పంచ్ లు ఆరోపిస్తున్నారు.సర్పంచ్ ల పదవీ కాలం ముగిస్తే గ్రామ పంచాయతీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారు.? ఎంపిడిఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా.. లేక ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఇంజనీర్‌లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా లేకుంటే నాలుగైదు గ్రామాలకు ఒక మండల స్థాయి అధికారిని ఇంచార్జ్ గా నియమించి వారికి చెక్ పవర్ ఇస్తారా.? అయితే, గతంలో నాలుగైదు గ్రామాలకు మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. గతం మాదిరి వ్యవహరించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించ లేదని సర్పంచ్ లు అంటున్నారు. ఈసారి అదే పంథాలో వెళ్లాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో రైతు బంధు అమలు చేయడం లేదని, ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీపై పెదవి విప్పటం లేదని, ఇప్పటి వరకు దీనిపై సమీక్ష జరపలేదని సర్పంచ్ లు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని కాంగ్రెస్ భావిస్తోందని సర్పంచ్ సంఘాల నేతలు తెలిపారు. ఇందుకే ప్రత్యేక అధికార్ల పాలన తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు సాగిస్తోందని అన్నారు. గ్యారంటీ పథకాలు పకడ్బందీగా అమలు చేసి, లబ్ధిదారులు పథకాల ఫలాలు అందించాకే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించనట్టు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ ల్లో అధికశాతం మంది బీఆర్ఎస్ కు చెందినవారే ఉన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బలమైన క్యాడర్ ఉంది. ఈ సమయంలో ఎన్నికలకు వెళితే, బీఆర్ఎస్ కే మేలు జరుగుతుం దని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే గ్రామాల్లో ప్రత్యేక అధికారి పాలన పెట్టాలని హస్తం పార్టీ పెద్దలు ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణల్లో తెలియజేస్తున్నారు. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు ఉండవని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తేల్చి చెప్పడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన రావడం ఖాయమని, దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సైతం తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్