– ఏపీకి ముందే అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్
– ఇప్పటివరకూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
– బీసీ లేదా ఎస్సీ నేతకు అప్పగిస్తారా?
– బీసీ అయితే మున్నూరు కాపు నుంచి గంగుల, ఎంపీ కేశవరావు?
– ఎస్సీ అయితే కడియం, కొప్పులలో ఒకరికి అవకాశం?
– ఇద్దరూ కేసీఆర్‌కు సన్నిహితులే
-ఇప్పటికే కాపు కోణంలో ఏపీకి తోటకు అవకాశం
– జనసేనను చీల్చే ఎత్తుగడతోనే కాపులకు అధ్యక్ష పదవి
– తెలంగాణలోనూ బీజేపీపై అదే అస్త్రం సంధిస్తారా?
– బండి సంజయ్‌పై కూడా మున్నూరు కాపు అస్త్రం ప్రయోగిస్తారా?
– ఖమ్మం సభలో అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీఆర్‌ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న అంశం ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత, ఏపీకి కాపు వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను నియమించారు. బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇప్పటిదాకా ఎవరినీ నియమించలేదు. టీఆర్‌ఎస్ పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కానీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత, ఇంకా జాతీయ కమిటీని కూడా ప్రకటించలేదు. ఈ నెల 18న ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించనున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్‌ఎస్ రాష్ర్ట అధ్యక్ష పదవి, ఎవరికి ఇస్తారన్న అంశం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటివరకూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్ ఉన్నందువల్ల, సహజంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతోంది. పార్టీని జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో.. కాపు-మున్నూరు కాపు కుల కోణానికి తెరలేచినందున.. కేటీఆర్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించటం కుదరకపోతే, జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.
ఏపీలో జనసేనకు మద్దతునిస్తున్న కాపుల ఓట్లు చీల్చే వ్యూహంలో భాగంగానే, ఆ వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను, బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా కాపుల సంఖ్య ఎక్కువ. తెలంగాణలోని మున్నూరు కాపులతో, దశాబ్దాల నుంచి ఆంధ్రా కాపులు కలిసే ఉంటున్నారు. కాపు సంఘాల సమావేశాలకు ఇద్దరూ హాజరవుతుంటారు.
దానికితోడు, మున్నూరు కాపు వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. బీజేపీ అధ్యక్షుడయిన తర్వాత, తెలంగాణలోని మున్నూరు కాపులు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. ఈ కుల సమీకరణను దృష్టిలో ఉంచుకునే.. ఏపీకి తోటచంద్రశేఖర్‌ను నియమించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇలాంటి విశ్లేషణ చేయడం విశేషం. జనసేనను వీక్ చేసేందుకు, కేసీఆర్-జగన్ కలసి కాపుల ఓట్లు చీల్చే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించిన విషయం తెలిసిందే.
అదే నిజమైతే.. బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మున్నూరు కాపు నేతకే పట్టం కట్టే అవకాశాలు లేకపోలేదని, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మున్నూరు కాపు నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా.. అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ దళపతి బండి సంజయ్‌కు, చెక్ పెట్టవచ్చన్న వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు.
పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో.. కులం కార్డుతో దానికి చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయం, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగా.. మున్నూరు కాపు వర్గ నేత, కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ పేరు పరిశీలించవచ్చంటున్నారు.
ఒకవేళ ఆయన కాకపోతే.. తెలంగాణ మున్నూరు కాపు వర్గాలతో సన్నిహిత సంబంధాలున్న, ఎంపీ కేశవరావు పేరు కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కేకేకు, తెలంగాణ మున్నూరు కాపు సంఘాలతో సంబంధ బాంధవ్యాలున్నాయి.
ఇక ఎస్సీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తే.. మాదిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాల వర్గానికి చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌లో ఒకరికి అవకాశం రావచ్చని చెబుతున్నారు.
ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ తొలి బహిరంగసభలో , అధ్యక్ష పదవి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తెలంగాణ అధ్యక్షుడిని ప్రకటించకుండా.. ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన వైనాన్ని, బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.
అదీకాకుండా, బీఆర్‌ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించిన నేపథ్యంలో.. అసలు పార్టీ మూలాలు ఉన్న తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షుడిని, ఇప్పటిదాకా నియమించకపోవడం విమర్శలకు గురవుతోంది. ఖమ్మం సభ వేదికగా ఈ విమర్శలకు, తెరదింపవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.