‘‘అనగనగా ఒక రాజు…అనగనగా ఒక రాణి’’ అనే పాట చాలా ఏళ్ల క్రితం వచ్చింది. తెలుగు సినిమాలో ఆణిముత్యాల్లాంటి పాటలో ఇది కూడా ఒకటిగా కీర్తి గడించింది. అన్న ఎన్టీఆర్, మహానటి సావిత్రి నటించడంతో పాటకు నిండుదనం కూడా వచ్చింది. ‘ఆత్మబంధువు’ సినిమాలో డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన ఈ పాట చరణంలో కొన్ని అద్భుత లైన్లున్నాయి.


‘‘నాది నాది అనుకున్నది నీది కాదు రా…
నీవు రాయన్నది…ఒకనాటికి రత్నమవునురా…
కూరిమిగలవారంతా కొడుకులేనురా…
జాలి గుండె లేని కొడుకు కన్న
కుక్క మేలు రా.. కుక్క మేలు రా…’’

బహుశా ఈ విషయం తెలిసే, చాలామంది కుక్కలను, పిల్లులను పెంచుకోవడం ఎక్కువైపోయింది. పెంచుకుంటే, పెంచుకున్నారు, వాటికి ఆస్తులు కూడా రాసి పారేస్తున్నారు. రాస్తే రాశారు… లక్ష రూపాయలో, రెండు లక్షలో కాదు…కోట్లు రాసి పారేస్తున్నారు. కోట్లంటే ఒకటి రెండు కాదు…ఏకంగా ఒక పిల్లికి ఒక అమ్మడు ఏకంగా రూ.800 కోట్లు ఆస్తి రాసి పారేసింది.
మరి అదేం చేసుకుంటుందో ఎవరికీ తెలీదు గానీ…ఆ పిల్లి మాత్రం దర్జాగా తెగ తిరిగేస్తోంది. మనుషులందరూ దానికి సలామ్ లు కొడుతూ…దాని సేవలో తరించేస్తున్నారు. దాని కనుసన్నల్లో గడుపుతూ అది చూపించే అభిమానం, ప్రేమ, వాత్సల్యాల కోసం తెగ పాకులాడుతున్నారు. ఇంతకీ ఇదెక్కడని అనుకుంటున్నారా?


అమెరికా సింగర్ టేలర్ స్విఫ్ట్…ఈ పని చేసి, ప్రపంచ దృష్టిని ఒక్కసారి ఆకర్షించింది. తన పెంపుడు పిల్లి ‘ఒలివియా బెన్సన్’ పేరిట రూ.800 కోట్ల ఆస్తి రాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన పెంపుడు జంతువుల్లో ‘బెన్సన్’ మూడో స్థానం దక్కించుకుంది. అయితే ఈ పిల్లి గొప్పతనం ఇంకొకటి ఉంది. తన పెంపుడు తల్లి సింగర్ అయిన టేలర్ స్విఫ్ట్ తో కలిసి బోలెడు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించి శభాష్ అనిపించుకుంది.
2020లో టేలర్ తన పెంపుడు పిల్లి ‘బెన్సన్’ తో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ఆరోజున ఆ పోస్టుకు 2 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పుడు రూ.800 కోట్ల వారసురాలు కావడంతో ఇంకా వ్యూస్, లైక్స్ పెరిగిపోతున్నాయి.

రూ.4,131 కోట్ల ఆస్తితో ఇటాలియన్ మీడియా సంస్థ గుస్తర్ కార్పొరేషన్ కు చెందిన జర్మన్ షెపర్డ్ జాతి కుక్క రూ.4131 కోట్ల ఆస్తితో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.
ఇక రూ.826 కోట్ల ఆస్తితో సియామీ అండ్ టాబీ మిక్స్ పిల్లి రెండో స్థానంలో ఉంది. దీనిపేరు నాలా క్యాట్. దీనికి ఇన్ స్టా గ్రామ్ పేజి కూడా ఉంది.

ఇక ముచ్చటగా మూడోది మనం పై నుంచి చెప్పుకునే సింగర్ టేలర్ స్విఫ్ట్ పిల్లి బెన్సన్…ఇదండీ లోకం తీరు సంగతి…