36.2 C
Hyderabad
Wednesday, May 29, 2024
spot_img

భాగ్యనగరం మరో బెంగళూరు అవుతుందా ?

      బెంగళూరు ఉదంతంతో నీటి ఎద్దడి మరోసారి తెరమీదకు వచ్చింది. బెంగళూరు ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో అదే పరిస్థితి నెలకొంది. నీటి ఎద్దడికి ఒకటి కాదు, రెండు కాదు అనేక కారణాలున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడవటం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణా లంటున్నారు నిపుణులు.దీనికితోడు భూగర్భ జలాలు అడుగంటిపోవడం మరో కారణంగా చెబుతున్నారు. గత రెండు దశాబ్దాలలో దేశ‌వ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భజలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడి స్తున్నాయి. ఒక అధ్య‌ య‌నం ప్ర‌కారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భజల వనరులను అవ‌స‌రా ల‌కు మించి వినియోగిస్తున్నట్లు స్ప‌ష్ట‌మైంది. వాల్టా చట్టం ఉల్లంఘనతోనే భూగర్భ జలాలు అడుగంటుతు న్నాయని పేర్కొన్నారు నీటిరంగ నిపుణులు.

     బెంగళూరు నగరంలో ఇటీవల తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నెలకు కేవలం ఐదు రోజులపాటే స్నానాలు చేసి సరి పెట్టుకుంటున్నారు బెంగళూరువాసులు. గుక్కెడు తాగు నీటి కోసం కర్ణాటక రాజధాని ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటి ఎద్దడి ఫలితంగా బెంగళూరులోని అనేక పాఠశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. శివారు ప్రాంతాలవాసులందరూ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ట్యాంకర్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. ఈ పరిస్థితి కేవలం బెంగళూరుకే పరిమితం కాదు. మనదేశంలోని అనేక నగరాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.

అడుగంటిన భూగర్భ జలాలు !
మ‌న‌దేశంలో భూగర్భజలాలను విచ్చలవిడిగా వినియోగించడమే నీటి ఎద్ద‌డికి ప్రధాన కార‌ణ‌మంటు న్నారు నిపుణులు. మోతాదుకు మించి ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తరిగిపోయాయి. దీని ఫ‌లితంగా దైనందిన అవ‌స‌రాల‌కు కూడా నీటి కొర‌త ఏర్ప‌డింది. గత రెండు దశాబ్దాలలో దేశ‌వ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భజలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భజల వనరులను అవ‌స‌రాల‌కు మించి వినియోగిస్తున్నట్లు స్ప‌ష్ట‌మైంది.భూమిలోకి నీరు ఇంకిపోవ‌డం ఒక స‌హ‌జ ప్ర‌క్రియ‌. భూమిలోకి ఎంత ఎక్కువ‌గా నీరు ఇంకితే అంత ఎక్కువ‌గా భూగర్భ జలాల నిల్వ‌లు ఉంటాయి.అయితే నేల‌త‌ల్లిలోకి ఇంకే నీరు కాల‌క్ర‌మంలో త‌గ్గిపోయింది. దీంతో భూగర్భజల మట్టాలు ఏడాదికేడాది త‌గ్గ‌పోతున్నాయి. పాతాళంలో కాసిన్ని నీళ్లుఉన్నా వాటిని కూడా ఎడాపెడా బోర్లు వేసి తోడేస్తున్నాం. ఒక‌వైపు నీటి ఎద్ద‌డి ఉంటే మ‌రో వైపు ఉన్న నీటిని అవ‌స‌రాల‌కు మించి ఎడాపెడా వాడేస్తున్నాం. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కడం భూగర్భ జలాలు తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

వాల్టా చట్టం అంటే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్‌ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే వాల్టా చట్టంగా పాపులర్ అయింది. ముఖ్యంగా భూగర్భ జలాల సంరక్షణే వాల్టా చట్టం ప్రధాన లక్ష్యం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ వాల్డా చట్టాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు వాల్డా చట్టాన్ని బలోపేతం చేయడానికి కిందటేడాది జీఓ 15 కూడా విడుదల చేసింది.వాల్టా చట్టం ప్రకారం, విచ్ఛలవిడి గా సహజ వనరులు వినియోగించుకునేందుకు వీల్లేదు. వాల్టా చట్టం ప్రకారం నీటి వినియోగం, నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం పరిశ్రమలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, హౌసింగ్ సొసైటీ, మంచినీటి ప్లాంట్లు సహా అనేక ఇతర ప్రదేశాల్లో బోర్లు వేయడానికి తప్పనిసరిగా భూగర్భ జలాల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ( ఎన్‌ఓసీ) ముందస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇష్టారీతిన బోర్లు వేస్తున్నారు. ఎక్కడో పాతాళంలో ఉన్న కాసిన్ని నీళ్లను కూడా ఎడాపెడా తోడి పారేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ వేసవిలో తాగునీటి సమస్య తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో వాననీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాననీటి సంరక్షణ మీద కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వాలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. హైదరాబాద్ నగరంలో దాదాపు ఐదు లక్షల వరకు అపార్ట్‌మెంట్లున్నాయి. వాన నీటి సంరక్షణ కోసం ప్రతి అపార్ట్‌మెంట్‌లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కొన్నేళ్ల నుంచి ఈ నిబంధన అమలు కావడం లేదు. ఇదిలా ఉంటే దాదాపు ఎనభై శాతం అపార్ట్‌మెంట్లలో అసలు ఇంకుడుగుంతల ఆనవాళ్లే లేవని తెలుస్తోంది. కాగా ఎండలు పెరుగుతుండటంతో హైదరాబాద్ నగరంలో క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏప్రియల్, మే నెలల్లో భూగర్భ జలాలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

నీటి సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి సమావేశం
ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొంది. వీటిలో అనేక ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. అలాగే నీటి విషయంలో భారత్‌లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి కిందటే డాది విడుదల చేసిన నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచదేశాల్లో నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి కిందటే డాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. ఈసమావేశానికి ముందు యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అనేక సంచలన విషయాలను వెల్లడించింది .నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయస్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటిరంగ నిపుణులు. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆ లక్ష్యానికి ప్రపంచదేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిరంగ నిపుణుడు రిచర్డ్ కాన్నర్ చెప్పారు. ఎడాపెడా పెరుగుతున్న నీటి ఎద్దడి, అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వైనం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలన్న చేదు వాస్తవాన్ని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ నివేదిక గుర్తు చేస్తోందని నీటిరంగ నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా, ఐక్యరాజ్య సమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. నీటి సంక్షోభంపై ఎప్పుడో 1977లో అర్జెంటైనాలో ఐక్యరాజ్యసమితి ఒక సమావేశాన్ని నిర్వహిం చింది. అప్పట్లో 118 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత నీటి సంక్షోభం అనే కీలక అంశాన్ని ఐక్యరాజ్యసమితి మరచిపోయింది. 46 ఏళ్ల తరువాత 2023లో మరోసారి ఐక్యరాజ్య సమితి మూడు రోజుల పాటు నీటి సంక్షోభంపై ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది..ఈ సమావేశం తరువాత అయినా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడికి పరిష్కారం లభిస్తుందని భారత్‌సహా అనేక ఆఫ్రికా దేశాలు ఆశిస్తున్నాయి.

సురక్షిత నీటికి కటకట !
మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో, నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ అవసరం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాలపాలవుతారు. ప్రాణాలు హరీమంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాదిమంది దూరంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం జనాభా కు సురక్షిత తాగు నీరుకు నోచుకోవడం లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికే తాగడానికి సురక్షిత నీరు ప్రజలకు అందడం లేదు. అభివృద్ధిలో వెనకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. ప్రజలకు సురక్షిత నీరు అందేలా ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి.

నీటిఎద్దడికి చిరునామా మరఠ్వాడా !
నీటి ఎద్దడి అనగానే మనదేశంలో వెంటనే గుర్తుకు వచ్చేపేరు మరఠ్వాడా. 1972-73 ప్రాంతంలో మహా రాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో నీటి ఎద్దడిని నివారించడానికి దుప్కాల్‌ నివారణ్‌ పేరుతో ఓ ప్రజా ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమానికి మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న కొంతమంది నేతలు మద్దతు ప్రకటించారు. మరఠ్వాడా నీటి సంక్షోభం మనిషి సృష్టించిన అనావృష్టి అని ఈ ఉద్యమం తేల్చి చెప్పింది. దీనికి విరుగుడు పరీవాహక ప్రాంతాల మధ్య ఉండే ప్రదేశాలను అభివృద్ధి చేయడమేనని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వాలేవీ సీరియస్‌గా తీసుకోలేదు.దీంతో మరఠ్వాడా ప్రాంతం ఇప్పటికీ నీటి ఎద్దడితో నానా ఇబ్బందు లు పడుతోంది.

Latest Articles

ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్‌ వార్నింగ్‌

     ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్‌ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్