వాళ్లకు వీళ్లకు మధ్య వైరం ఏం లేకపోయినా.. ఒకళ్ల మీద ఒకళ్లు దాడులకు తెగబడుతున్నారు. కలహించుకుంటున్నారు.. కాల్పులు కాల్చుకుంటున్నారు. ప్రాణాలు తీసేసుకుంటున్నారు. సిద్ధాంతాల పేరున వాళ్లు, విధుల నిర్వహణ పేర వీళ్లు.. ఈ కలహాలు ఈ నాటివి కావు. ఒకళ్లు మావోయిస్టులు..ఇదివరకటి పేరు నక్సలైట్లు. మరొకళ్లు రక్షక భటులు. రక్షక భటులేమిటి కక్షల మాదిరి ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు. అసలు వాళ్లకు వీళ్లెవరో తెలియదు. వీళ్లు, వాళ్లు ఎదురుబడితే కాల్పుల జోరు జరిగిపోతుంది.
నాటి నక్సలైట్ లు నేటి మావోఇస్టుల లక్ష్యం.. అన్యాయంగా అక్రమంగా అర్జించిన వారిని మట్టు పెట్టి.. ఆ సొమ్ములను పేదలకు పంచడం. ఇదిప్పుడు ఈ రీతిలోనే జరుగుతోందా అంటే.. సమాధానం లేని ప్రశ్న ఉద్భవిస్తోంది. నిండు ప్రాణాలు తీసేసే హక్కు ఎవరికీ లేదు. ఇందులో మావోలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, లేక మరెవరైనా శిక్షార్హులే.. ఇది ప్రభుత్వం వెళ్లే మార్గం. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మరో భారీ భీకర ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కొల్పోయారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు సైతం మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతాదళాలకు మావోలు ఎదురుపడ్డారు. ఇంకేముంది…కాల్పుల యుద్దం మొదలైంది. మావోలు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో 31 మంది మృతి చెందగా, పలువురు మావోలు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేటట్టు తెలుస్తోంది. డీఆర్ జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు మావోల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్ గడ్ చరిత్రలో ఇది రెండో భారీ ఎన్ కౌంటర్ గా తెలుస్తోంది. గతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 41 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై బస్తర్ ఐజీ సుందర్ రాజు స్పందించారు. ఆపోజిట్ ఫైరింగ్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినది వాస్తవమే అని ఆయన ధృవీకరించారు. ఇందులో ప్రాణాలకు తెగించి పోరాటం సాగించిన ఇద్దరు జవాన్లు సైతం అమరులయ్యారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు జవాన్లకు వైద్య చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలిలో పెద్ద మొత్తంలో ఆయధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ సుందర్ రాజు చెప్పారు.
2026 నాటికి మావోయిస్టు వ్యవస్థను కేంద్ర సర్కారు సంపూర్ణంగా నిర్మూలిస్తుందని జనవరి 6 న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్లు వేగవంతం అయినట్టు తెలుస్తోంది.