స్వతంత్ర వెబ్ డెస్క్: ఎమ్మెల్యే సీతక్క బీఆర్‌ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతు నొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజాసేవ, డబ్బు సంచుల మధ్య యుద్ధం మొదలవుతుందని, తాను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదని, అక్రమ కేసులు పెట్టించలేదని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
మిడతల దండులాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని, తనను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడ ఉంటుంది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తున్నారు. సీతక్క బాగా పని చేస్తుందని అసెంబ్లీలో పొగుడుతున్నారు. ఇక్కడ కొచ్చి ఓడించమంటున్నారు. ములుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని డబ్బు సంచులతో ముడి పెడుతున్నారు. ప్రజలే నా కుటుంబం.. నియోజకవర్గం ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారు. బీఆర్‌ఎస్ నాయకులంతా దండయాత్రలు చేసి ములుగును భయాందోళన గురిచేస్తున్నారు’’ అంటూ సీతక్క నిప్పులు చెరిగారు.