గడికోట వర్సెస్ మండిపల్లి అన్నట్లుగా సాగిన ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరించబోతోంది ? ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే మాట విన్పిస్తోంది. అటు.. పార్టీలు, అభ్యర్థులు మాత్రం పోలింగ్ సరళిపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.
ఒకవైపు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు.. మరొకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఏరికోరి బరిలో దింపిన నేత..! వాళ్లిద్దరి మధ్యా హోరాహోరీగా సాగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు ? ఓడెదెవరు ? దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. నిజమే.. అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఇదే. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గడికోట శ్రీకాంత్ రెడ్డి బరిలో దిగగా.. టీడీపీ నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పోటీ చేశారు.ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిదన్న సంగతి కాస్త పక్కన పెడితే.. పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల బలాలు బలహీనతల పరంగా చూస్తే.. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ వీడడంతో హస్తానికి రాజీనామా చేసిన ఆయన వైసీపీలో చేరారు. జగన్ వెంట తొలినుంచీ నడిచారు. ఇక అప్పటి నుంచి 2012 ఉపఎన్నిక, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించారు. జగన్ కోటరీగా భావించే వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఏపీలో జరిగిన జిల్లాల విభజన సందర్భంగా అన్నమయ్య జిల్లా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు శ్రీకాంత్ రెడ్డి. దీంతో కొంత సానుకూల పవనాలు వీచాయి. దీనికితోడు ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన నవరత్నాల్లో భాగంగా నియోజకవర్గంలో మెజార్టీ సభ్యులకు పథకాలు అందేలా చూడడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలు చేశారన్న ఆరోపణలు బలంగా విన్పించడం మైనస్ పాయింట్‌గా మారిందన్న విమర్శలున్నాయి. కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించడం తప్ప ఒరిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. అయితే.. టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో రమేష్ రెడ్డి పోటీ చేయగా.. ఈసారి మాత్రం గట్టి అభ్యర్థిని బరిలో దించాలని భావించారు తెలుగు దేశం అధినేత చంద్రబాబు. దీంతో.. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఆయన.. ఈ ఎన్నికల్లో గణనీయంగా లాభపడేందుకు ప్రయత్నించారు. దీనికితోడు మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, ద్వారకానాథ్ రెడ్డితోపాటు అధినేత చంద్రబాబు సైతం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా.. పోలింగ్ కూడా నియోజకవర్గంలో భారీగా జరిగింది. దీంతో.. ఇప్పుడు పెద్ద ఎత్తున జరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్న మాట విన్పిస్తోంది. ఇప్పటికే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు, గ్రామాల్లో బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, పోలింగ్ సరళి గమనించిన పార్టీలు.. ఎవరికి వారే రానున్న ఫలితం తమకే అనుకూలం అంటే మాకే అనుకూలం అంటూ చెబుతున్నాయి. దీంతో.. జూన్ నాలుగున ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.


