ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు..? టీడీపీ నుంచి మంత్రి అయిన వారికి ఈ శాఖ దక్కుతుందా లేదంటే జనసేన మంత్రివర్గంలో చోటు సాధించిన వారికి ఈ శాఖ ఇస్తారా? ఈ రెండూ కాదంటే బీజేపీ నుంచి మంత్రిగా ఎంపికైన వారికి ఛాన్స్ దక్కుతుందా? దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శాఖ ఎవరికి ఇవ్వాలన్న దానిపైనే ఇప్పుడు ప్రతిష్టంభన నెలకొంది.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తైపోయిం ది. ఇప్పుడు సీఎం చంద్రబాబు దృష్టంతా మంత్రులకు శాఖల కేటాయింపు పైనే నెలకొంది. ఇప్పటికే ఆ దిశగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి. నిజానికి తిరుమల పర్యటన వెళ్లేముందే మంత్రులకు శాఖలు కేటాయిస్తారని భావించినా, ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
ప్రధానంగా కొన్ని శాఖల విషయంలో భాగస్వాములు డిమాండ్ చేస్తుండడమే ఇందుకు కారణమన్న వాదన విన్పిస్తోంది. ప్రత్యేకించి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వ పాలనలో రెవెన్యూది చాలా కీలకమైన పాత్ర. పైగా ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం చూసినా అమరావతి రాజధాని భూముల వ్యవహారం చాలా కీలకంగా మరోసారి మారనుంది. పైగా విశాఖకు, కర్నూలుకు న్యాయం చేస్తామని ఏపీ సీఎం ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలతోపాటు చుట్టు పక్కల జిల్లాల్లోనూ రియల్ భూం కొనసాగనుంది. కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనున్నాయి. దీంతో.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. అంతేకాదు.. ఇలా వచ్చే రెవెన్యూనే రాష్ట్రాభివృద్దిలో చాలా కీలకం కానుంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడంతోనే కూటమిలోని పార్టీలు రెవెన్యూ శాఖ కోసం గట్టి పట్టు పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎవరికి ఇవ్వాలి. అన్నదానిపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. అయితే ఎవరికి ఇచ్చినా మరోపార్టీ నేతల్లో కొంత మేర అసంతృప్తి వచ్చే అవకాశాలు ఉండడంతో ఏం చేయాలి. ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరి.. చివరికి రెవెన్యూ శాఖ ఎవరికి ఇస్తారు. అన్నది ఆసక్తి. అంతకుమించిన ఉత్కంఠ రేపుతోంది.