చోద్యం కాకపోతే పిల్లి నాదంటే నాదని..వాదులాడుకోవడం, ఘర్షణలు పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్లడం ఎక్కడైనా చూశామా..అని చాలామంది బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే, పోలీస్ స్టేషన్ కే కాదు ఏకంగా ఈ పంచాయతీ, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరకు వెళ్లిపోయింది. పిల్లేవరిదో చెప్పడం ఎస్పీ సార్ వల్ల అయినట్టు లేదు. తెల్లగా మెరిసిపోతూ.. ముద్దు ముద్దుగా మ్యావ్ మ్యావ్ అనే మా బుల్లి పిల్లమ్మ.. వేరెవరో మాది అంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని, గుర్తు పట్టకుండా ఉండడానికి పిల్లి పిల్లకు రంగేసి పారేశారని ఒకరు… పిల్లులకు రంగులు వేయడాలు, తస్కరించడాలు మా ఇంటా వంటా లేవని మరొకరు అంటున్నారు.
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందనే కథల్లో చదువుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లెం పిల్లికే వచ్చిపడింది. తానెవరి దగ్గరకు వెళ్లాలో, తన ఓనర్ ఎవరో తెల్చుకోలేక తెగ సతమతం అయిపోతోంది. ఓ వేళ నేను మీకు చెందినదాన్ని అని నోరు తెరిచి చెబుతామన్నా..నోరవుతే ఆవలింత మాదరి తెరవగలను కాని, నోట్లోంచి వచ్చేది మ్యావ్, మ్యావ్ తప్ప మాటలు కాదుగా.. ఇంకెలా చెప్పగలను అని ఆ బుల్లిపిల్లమ్మ మౌన వేదన అనుభవిస్తూ ఉండవచ్చు. అది వేరే విషయం. ఇక..అసలు విషయంలోకి వస్తే.. నల్గొండ జిల్లా కేంద్రం రెహెమత్ నగర్ కు చెందిన యువతి మూడేళ్ల క్రితం ఏక మాసం వయస్సున్న పిల్లిపిల్లను తెచ్చుకుంది. మూడేళ్ల నెల వయస్సున్న బుజ్జి పిల్లికి.. అప్పుడెప్పుడో ఓ అందమైన పేరు పెట్టేసి, దాని ఆలనా, పాలనా చక్కగా చూసుకుంటూ…ఆ పిల్లిపిల్లే లోకంగా ఉంటోంది. అయితే, గత ఏడాది మిట్ట మధ్య నెలలో….జూన్ లో.. పిల్లి గాయబ్ అయిపోయింది.
గాయబ్ అయిన పిల్లి గాయాలతోనే బాధపడుతోందో, ఎక్కడైనా సేఫ్ గానే ఉందో తెలియక తన పిల్లిని తల్చుకుంటూ ఆమె భారంగా రోజులు గడుపుతుండగా..ఓ పిల్లి తన ఇంటి సమీపంలో కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే.. అది తన పిల్లే అని ఆమె భావించింది. మనుషులకైతే విశ్వాసాలు, నమ్మకంగా ఉండడాల్లాంటివి ఉంటయో ఉండవో కాని.. మూగజీవాలు అలా కాదు కదా… అందుకే యజమాని ఇంటికి వచ్చేసిందేమో మరి..అని ఇరుగు పొరుగు ఇలా వ్యాఖ్యానించేసుకున్నారు. ఇది కరెక్ట్ అవునో కాదో కాని, పిల్లికి అపార మేధా శక్తి ఉంటుందని పెద్దలు చెబుతూంటారు. పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు ఇళ్లు తిప్పింది అనేది సామెత. ఇళ్లు మారడాలు, సామాన్లు, చట్టుబండలు మనుషులకే కాని పిల్లులకు, బల్లులకు ఈ బాధలు ఉండవు కదా..! ఎన్ని పిల్లల్ని కన్నా… ఒక్కో పిల్లి పిల్లను నోట కర్చుకుని హార్మ్ ఫుల్ ప్లేస్ నుంచి సేఫ్టే ప్లేస్ లకు తీసుకెళ్లిపోవడం పిల్లులకు వెన్నతో పెట్టిన విద్యే అని మనందరికీ తెలుసుకదా.. ఇవన్నీ మనం నిత్యం చూస్తున్నఘటనలే కదా.. అయితే, పిల్లి వివాదం, వైరంలో ఓ వెర్షనే ఇప్పటికి పూర్తయ్యింది.
ఇక రెండో వెర్షన్ లోకి వస్తే… ఆ యువతి ఇంటి సమీపంలో ఉండే ఓ వ్యక్తి.. ఆ పిల్లి తనదని, తమ పిల్లిని మీరెలా తీసుకెళతారని వాదులాటకు దిగారు. ఈ పిల్లి నూటికి నూరు శాతం తనదే అని.. అందుకే అంత ఆప్యాయంగా తన ఇంటికి వచ్చేసిందని ఆమె తెలిపారు. తాను గుర్తు పట్టకుండా పిల్లికి రంగేసేశారని వాపోయారు. వైట్ క్యూట్ క్యేట్ కు కలర్స్ వేసి మోసం చేయడం తగదని అన్నారు. అయితే, తానేం పిల్లి తస్కరించాలేదు, రంగులు వేయలేదు, ఈ పిల్లి తనదే అని ఆయన వాదించారు. రంగేసిన పిల్లికి
శుభ్రంగా సబ్బులు, సర్ఫ్ లు పెట్టి, బకెట్ల, బకెట్ల నీళ్లతో స్నానం చేయించానని ఆమె చెప్పారు. దీంతో..వాగ్వివాదం చినికి చినికి గాలివానగా మారింది.
ఏదో ఇంగ్లీష్ నాన్ డి టెయిల్ లో రాజుల కాలం నాటి కథలో ఓ ఇల్లాలు, మరో ఇల్లాలు ఒక బిడ్డని …తనదంటే తనదని వాదులాడుకున్నారని, రాజు వద్దకు ఈ పంచాయతీ చేరిందని ఆ కథలో ఉంది. అప్పుడు రాజు, ఆ బిడ్డను రెండు ముక్కలుగా కోయండని తీర్పు చెప్పగా. అసలు తల్లి బేజేరెత్తిపోయి.. తన బిడ్డను ఆమెకే ఇచ్చేయమని చెప్పడం, అసలు తల్లి తేలిపోవడం ఆ కథలో జరిగింది. అయితే, ఇప్పుడు అలాంటివి చెల్లవు. మీరు మీరు గొడవపడి నా ప్రాణాలు తీస్తారా అని ఆ బిడ్డడు అప్పుడు అడక్కపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఈ పిల్లిమీద అలాంటి ప్రయోగాలు చేస్తే..రక్కి పారేయకుండా ఉంటుందా..వాదులాడుకున్న వాళ్లిద్దరూ సైతం అలాంటి ఘోరాలను ఒప్పుకోరు కదా..! అసలు ఎవ్వరూ దీన్ని అంగీకరించరు కదా.. ఈ ఇస్యూ తేలిస్తే తేల్చండి, లేదంటే మానేయండి.. పిల్లిని హ్యాపీగా బతకనివ్వండని అని అందరూ అనేస్తారు. దీంట్లో ఏ సందేహం ఉండదు
అయితే, నిజం నిగ్గు తేలాలని ఫిర్యాదు చేసినవారు పట్టుదలగా ఉండవచ్చు. ఈ ఘటనపై మొదట పిల్లిని చేరదీసిన ఆమె నల్గొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వాళ్లు తేలిగ్గానే తీసుకున్నారో ఏమో ఓకే అని చెప్పి ఊరుకున్నారు. నెలలకు నెలలు మనుషులు, క్రైంల కేసులే పెండింగ్ లో ఉండిపోతుంటే ఈ పిల్లి తగదా ఏమిటి.. సందట్లో సడేమియాలా అనుకున్నారో ఏమో…దాని సంగతి ఓ మూల ఉంచేశారు. అయితే, తన ఫిర్యాదు పట్టించుకోలేదని, పిల్లంటే అంతా లోకువా… అంటూ.. ఏకంగా జిల్లా ఎస్పీ దగ్గరకే ఆమె వెళ్లి ఫిర్యాదు చేసేశారు. పిల్లి పంచాయతీ తేల్చి తీరాల్సిందే అని ఆమె పట్టుబట్టారు. దీంతో.. పోలీసులు.. ఆ పిల్లమ్మ ఎవరికి చెందినదో, అసలు ఓనర్ ఎవరో తేల్చడానికి రెడీ అయ్యారు. పిల్లి రోమాలను హైదరాబాద్ లక్డీకాపూల్ లోని ఫోరెనెక్స్ ల్యాబ్ కు తరలించారు. పిల్లి ఎవరిది అనే మాట కంటే ముందు.. పిల్లికి రంగు వేశారా లేదా అనే విషయంపై ఫోరెనెక్స్ ల్యాబ్ సిబ్బంది తెగ పరిశోధన చేసేస్తున్నారు. అఫ్ కోర్స్ రంగు వేయడం, వేయకపోవడం అనే విషయం తెలిస్తే.. పిల్లి ఓనర్ ఎవరూ అనే విషయం తెలిసిపోవడం పెద్ద కష్టం ఏమి కాదు కదా..!


