అటా.. ఇటా..! ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఇదే. ఈ విషయాన్నే ఎటూ తేల్చుకోలేకపోతున్నారాయన. ఇదే అంశాన్ని బహిరంగ సభ సాక్షిగా బహిరంగంగా వెల్లడించారు. ఇంతకీ రాహుల్‌ను అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య ఏంటి? అటైతే వచ్చే లాభాలేంటి? ఇటైతే వచ్చే ఇబ్బందులేంటి? ఇంతకీ రాహుల్ ఈ ఇష్యూలో ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ శ్రేణులను సైతం వేధిస్తున్న ప్రశ్న ఇది.
కేంద్రంలో అధికారం అందుకోలేకపోయినా ఎన్డీయే కూటమిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా చేసింది ఇండియా కూటమి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ. అవును 2019 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలను లోక్‌సభ ఎన్నికల్లో సాధించింది. 99 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇండియా కూటమి మేజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా, సొంతంగానే 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికి వచ్చారంటే అందుకు కారణం నిస్సందేహంగా రాహులేనని చెప్పాలి.
భారత్ జోడో యాత్ర, జోడో న్యాయ్ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూశారాయన. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా కులగణన సహాపలు అంశాలను చేపడ తామని హామినిచ్చారు. ఇక, రాహుల్ యాత్రలతో హస్తం శ్రేణులు సైతం కదం తొక్కాయి. మరింత హుషారుగా పనిచేశాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి మంచి ఫలితాలే సాధించింది. అయితే స్వయంగా కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగిన రాహుల్‌ను ప్రజలు రెండు చోట్లా ఆదరించారు. దీంతో తిరుగులేని విజయం సాధించారు.
సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు రాహుల్ గాంధీని తీవ్రంగా ఆలోచించేలా చేస్తోంది. నిబంధనల ప్రకారం రెండు స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే రాహుల్ గాంధీ వయనాడ్‌ను వదులుకుంటారా లేదంటే రాయ్‌బరేలీ ఎంపీగా తప్పుకుం టారా అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు రాహుల్ సైతం ఇదే అంశంపై విస్తృతంగా ఆలోచిస్తున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేనా అసలు తాను ఎటువైపు మొగ్గు చూపాలో అన్న దానిపై తేల్చుకోలేకపోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. కేరళ పీసీసీ నేతలు మాత్రం వయనాడ్ లోక్‌సభా స్థానాన్నే రాహుల్ గాంధీ వదులుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతు న్నారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి గాంధీల కుటుంబానికి చెందిన వారు అమేథీ, రాయ్‌బరేలీల నుంచి పోటీ చేస్తున్నారు. వారికవి సొంత నియోజవర్గాలు. రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పలుమార్లు పోటీ చేసి తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి చోటు నుంచి రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో విజయం సాధించడంతో సహజంగానే ఆయన ఈ స్థానం నుంచే ప్రాతినిథ్యం వహిస్తారని, వయనాడ్‌ను వదులుకుంటారన్న చర్చ జరుగుతోంది.
ఒకవేళ కేరళ నేతలు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ ఇప్పుడు వయనాడ్‌ను వదులుకోవాలని భావిస్తే అందుకు గల కారణాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ అలా చేయడానికి ప్రధాన కారణం రాయ్‌బరేలీ స్థానంలో గెలవడం ఒక్కటే కాదు. పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ చేయాలన్న భావనే అని చెప్పాలి. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలంటే ఆ రాష్ట్రంపై మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన ఎస్పీ ఇక్కడి నుంచి మంచి ఫలితాలు సాధించడంతో ఈ ఐదేళ్లలో రాహుల్ ఇక్కడి ఎంపీగా ఉండి పార్టీ పటిష్టతపై మరింతగా ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి యూపీలో మెజార్టీ సీట్లు సాధించవచ్చని ఆలోచిస్తున్నారు. ఇటీవలె జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపైప్రధానంగా చర్చించారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రాహుల్ గాంధీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ స్థానాన్ని వదులు కున్నా, ఆయన పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి రంగంలో దిగేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతు న్న సమచారం ప్రకారం రాహుల్ ఖాళీ చేసిన ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగవచ్చన్న మాట విన్పిస్తోంది. కేరళలో ఉన్న వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉంది. అందుకే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఇలాంటి చోటు నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగి గెలవడం ద్వారా కేరళలోనూ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రియాంక ఎంపీగా ఇక్కడ్నుంచి ఎన్నికైతే ఆ ప్రభావం పొరుగునే ఉన్న తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోనూ ప్రయో జనం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తం అంశాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేస్తుంది ? ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.