ఒకవైపు జగన్.. మరోవైపు షర్మిల.. ఈ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు.. తనయుడు సీఎం జగన్‌కు విజయమ్మ మద్దతిస్తారా..? లేక కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అండగా ఉంటారా..? తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉన్న విజయమ్మ.. ఏపీలో కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తారా..? తాజాగా ఏపీలో అదీ జగన్ పాలనలో షర్మిల అరెస్టైన నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు, ఇప్పటి ఎన్నికలకు చాలా తేడానే కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబ సభ్యులుగా వైఎస్ విజయమ్మ, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల అంతా ఒకే తాటిపై నడిచారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చీ రావడంతోనే జగన్, షర్మిల, విజయమ్మ తలోదారి ఎంచుకున్నారు. రాజకీయంగా జగన్‌తో విభేదించిన షర్మిల తెలంగాణలో YSRTPని స్థాపించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరు నేపథ్యంలో విజయమ్మ ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వైసిపి గౌరవాధ్యక్షురాలు గా ఉన్న విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించింది వైసిపి. అయితే షర్మిలకు రాజకీయంగా తోడుగా నిలిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటు గతంలో విజయమ్మ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ స్వయంగా షర్మిల పక్షాన అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్న షర్మిల.. ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. సోదరుడు సీఎం జగన్ పాలనే లక్ష్యంగా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
మెగా డీఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు షర్మిల. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఇది కాస్త ఉద్రిక్తతలకు దారి తీయడంతో షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై వైఎస్ ఆత్మ క్షోబించడంతోపాటు తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. షర్మిల అరెస్ట్ వ్యవహారంతో.. ఇప్పుడు విజయమ్మ ఆమె తరఫున రంగంలోకి దిగుతారా..? అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది.
సీఎం జగన్, షర్మిల రాజకీయంగా ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎవరికి తోడుగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలవాలన్నది విజయమ్మకు సంకటంగా మారినట్లు తెలుస్తోంది. రాజకీయంగా జగన్‌కు మద్దతు ఇస్తే షర్మిలకు బాధ కలగవచ్చు. అదే సమయంలో షర్మిలకు అండగా నిలిస్తే.. జగన్ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎటు తేల్చుకోలేక పోతున్నారు విజయమ్మ. ఇప్పటికే వివేకా హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు జగన్, షర్మిల రాజకీయ పోరాటం తీవ్రమైన వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. అసలు విజయమ్మ దారెటో ఆమె నిర్ణయమేమిటో వేచి చూడాలి.


