ఒడిశాలోని పూరీ జగన్నాథ భండాగారం తెరుచుకోనుంది. నగలు, ఇతర విలువైన వస్తువులను భద్రపరిచే రత్న భండార్‌లోని లోపలి గదిని ఈ నెల 14న తెరవాలని ఉన్నతస్థాయి సంఘం సిఫార్సు చేసింది. రత్న భండార్‌ను తెరిచే విషయమై ఏర్పాటయిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి సంఘం పూరీలో సమావేశమయి చర్చలు జరిపింది. లోపలి గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీకి ఏకగ్రీవంగా సిపార్సు చేసింది. ఆ కమిటీ ఈ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకోనుంది.
46 ఏళ్ల క్రితం చివరిసారిగా 1978లో రత్నభండార్‌ను తెరిచి నగల విలువను లెక్కించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రత్న భండార్ తెరవడం ప్రచార అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రత్న భండార్‌ను తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో హామీ అమలు కోసం ఉన్నత స్థాయి సంఘాన్ని నియమించింది. ఈ సంఘానికి జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. రత్న భండార్‌కు ఉన్న రెండో తాళం చెవిని ఇవ్వాలని ఆయనను కమిటీ కోరింది. అయితే ప్రస్తుతం రథయాత్ర దృష్ట్యా బిజీగా ఉన్నందున ఇప్పుడే ఇవ్వలేమని ఆయన సమాధానం ఇచ్చారు. దాంతో ఈ నెల 14న ఇవ్వాలని సూచించింది. ఒకవేళ రెండో తాళం చెవి ద్వారా తెరవలేని పరిస్థితి వస్తే తాళాన్ని బద్దలు కొట్టాలని కమిటీ నిర్ణయించింది. నగల జాబితాను రూపొందించాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలని ప్రతిపాదించింది.


