తెలంగాణపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. ఏపీ తరహా పొత్తులకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యూహమే కమలనాథులను కంగారు పెడుతోంది. ఇప్పుడిప్పడే పార్టీ మంచి జోష్‌లో ఉన్న సమయంలో పొత్తులు అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే ఎక్కడ తమ పార్టీపై మళ్లీ ప్రభావంపడుతుందోననే కలవరంలో ఉన్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు జీహెచ్‌ఎంసీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీకి పూర్వవైభవం దిశగా.. తమకు పట్టున్న గ్రేటర్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే,.. ఏపీలో మాదిరే జనసేన, బీజేపీలతో కలిసి పొత్తులతో బరిలో దిగుతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈప్రచారమే ఇప్పుడు కమలనాథులను కలవరపెడుతోంది. గతంలో కంటే పార్టీ బలోపేతంకావడం,.. ఇటు బీఆర్‌ఎస్ ఢీలా పడటం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలకు చంద్రబాబు ఎత్తుగడలు ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
టీడీపీతో పొత్తుకు బీజేపీ హైకమాండ్ సై అంటే.. అది బీఆర్‌ఎస్‌కు కలిసివచ్చ అంశంగా భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. గులాబీ నేతల చేతిలో శక్తివంతమైన ఆయుధం పెట్టినట్టే అవుతుందంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు శత్రువుగా భావించే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్న కసి ప్రజల్లో ఉంటుందని.. అది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క బీఆర్‌ఎస్‌కే కాదు.. ఎంఐఎం పార్టీకి కూడా లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ వ్యూహాలు రచిస్తున్న తరుణంలో.. పొత్తులతో వెళ్తే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క బీఆర్‌ఎస్‌కే కాదు.. ఎంఐఎం పార్టీకి కూడా లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పొత్తులతో వెళ్తే వచ్చే నష్టాన్ని హైకమాండ్‌కు వివరించాలన్న యోచనలో తెలంగాణ బీజేపీ నాయతక్వం ఉన్నట్టు తెలుస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి 13.9 శాతంగా ఉన్న బీజేపీ ఓట్ల శాతం.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతానికి పెరిగింది. ఇదే విషయాన్ని వివరించి పొత్తుల వ్యూహాలకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.