తాను యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు మంత్రి నారా లోకేష్.. మన మిత్ర పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. గతంలో చంద్రబాబు ఈ గవర్నన్స్‌తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నామని అన్నారు. బటన్ నొక్కితే భోజనం.. సినిమా టికెట్లు వచ్చినపుడు పాలన ఎందుకు అందుబాటులోకి రాదు అనే ఆలోచనే వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు.. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో 160కి పైగా పౌర సేవలు…. రెండో విడతలో 300కి పైగా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు లోకేష్.