ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగింది . అదే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసి మంచి ఫలితాలను సాధించింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. బీజేపీ తరువాత శాసనసభలో రెండో అతి పెద్ద పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. ఈ దశలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆప్. దీంతో కేజ్రీవాల్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.
జన్‌లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనందుకు నిరసనగా 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్. అలాఏ ఢిల్లీ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేశారు. ఆ తరువాత 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలను ఆప్ తన ఖాతాలో వేసుకుంది. బీజేపీని కేవలం మూడు స్థానాలకు పరిమితం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆతరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు గెలుచుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు కేజ్రీవాల్. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచింది. గతంలో గవర్నమెంట్ స్కూళ్లలోకి పిల్లలను పంపేవారు కాదు ఢిల్లీలోని తల్లిదండ్రులు. అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలను కార్పొరేట్ స్కూళ్లు మానిపించారు తల్లిదం డ్రులు. ఎంచక్కా కేజ్రీవాల్ సర్కార్ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు పంపడం మొదలెట్టారు పేరెంట్స్. అంతేకాదు గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు మెరుగైన శిక్షణ కోసం విదేశాలకు కూడా పంపింది కేజ్రీవాల్ సర్కార్.
మొహల్లా క్లినిక్…ఇది కేజ్రీవాల్ బుర్రకు పుట్టిన ఆలోచన. సహజంగా పేదలు ఎక్కువగా బస్తీల్లో నివసిస్తారు. వీరికి ఆరోగ్య సమస్యలు వస్తే బస్తీల్లో చికిత్స చేయించుకోవడానికి అక్కడ ఎలాంటి ఆస్పత్రులు ఉండవు. కార్పొరేట్ ఆస్ప త్రులకు వెళ్లాలంటే పేదలకు అంతటి ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో బస్తీ ప్రజల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులు ఏర్పాటు చేసింది కేజ్రీవాల్ సర్కార్. ఇవే బస్తీ క్లినిక్‌లుగా పాపులర్ అయ్యాయి. కేజ్రీవాల్ సర్కార్‌కు మంచి పేరు తీసుకువచ్చాయి. ఢిల్లీ మోడల్ …ఇటీవలి కాలంలో దేశ రాజకీయాల్లో హల్‌చల్ అవుతున్న పేరు ఇది. ఢిల్లీ మోడల్ అనగానే ఎవరికైనా ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుకువస్తుంది. సింపుల్‌గా చెప్పా లంటే ఢిల్లీ మోడడల్ అరవింద్ కేజ్రీవాల్ అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రం. ఢిల్లీ మహా నగరాన్ని అభివృద్ధి చేయడానికి తాము ఏం చేశామో, ఏ ఏ అంశాలకు టాప్ ప్రయారిటీ ఇచ్చామో వివరించే ప్రణాళికే ఢిల్లీ మోడల్. ఇందులో అనేక అంశాలుంటాయి. ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యం, బస్తీల్లో నివసించే పేదల మొహల్లా క్లినిక్‌లు, వాటిలో అందుతున్న ఉచిత చికిత్స,పరిపాలన లో పారదర్శ కత ఇవన్నీ ఢిల్లీ మోడల్‌లో ఉంటాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావిస్తుంటారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మోడల్ ను మీ రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశాన్ని ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడి కేజ్రీవాల్ కోరుతుంటారు. కేజ్రీవాల్ దృష్టిలో ఢిల్లీ మోడల్ ఒక కాగితం కాదు. ఢిల్లీ మోడల్ అభివృద్ధికి చిరునా మా అంటారు కేజ్రీవాల్.
గతంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు కేజ్రీవాల్. ఆప్ సర్కార్ ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని మొదలెట్టాలని భావించినా, అడ్డుపుల్లలు వేసేవారు లెఫ్టినెంట్ గవర్నర్. తరచూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా వైఖరి మార్చుకు నేవారు కాదు. ఒక దశలో లెఫ్టినెంట్ గవర్నర్ అప్పాయింట్‌మెంట్ కోసం ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కొన్ని గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడానికే కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బం దులు పెడుతున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ నగర పొలిమేరలకే పరిమితం చేయాలని కేజ్రీవాల్ అనుకోలేదు. పార్టీని విస్తరించాలని భావిం చారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆప్ పోటీ చేయడం మొదలెట్టింది. తనకంటూ కొన్ని ఓట్లు తెచ్చుకునేది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దేశ వ్యాప్తంగా ఓట్ షేర్ పెరిగింది. పార్టీని విస్తరించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ కేజ్రీవాల్ వదులుకోవడంలేదు. 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది.
ఆమ్ ఆద్మీపార్టీ జైత్రయాత్ర ఢిల్లీ నుంచి పొరుగునే ఉన్న పంజాబ్‌లోకి ప్రవేశించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ చతికిలపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆప్ నేత భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్య మంత్రి అయ్యారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీగా ఆప్ గుర్తింపు తెచ్చుకుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రాత్రికిరాత్రి అధికారంలోకి రాలేదు. ఇందుకు కేజ్రీవాల్ నిరంతర శ్రమ ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేసి 20 సీట్లు గెలుచుకుంది.పంజాబ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్‌ను మూడో స్థానానికి నెట్టివేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ అస్తవ్యస్త పాలన సాగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆప్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిం చింది. అనేక ప్రజా సమస్యలపై ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పారు.
ఈనేపథ్యంలో 2022 నాటికి పంజాబ్ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ అమలు చేసిన ప్రజాకర్షక పథకాలు పంజాబ్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు, బస్తీల్లో మొహల్లా క్లినిక్‌ల సేవలు ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ పాయింట్లు అయ్యాయి. దీంతో 2022 ఎన్నికల్లో ఆప్ అద్భుత విజయాన్ని సాధించింది.


