28.9 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ముందున్న సవాళ్లేమిటి?

ఢిల్లీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. 26 సంవత్సరాల తరువాత ఢిల్లీలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే దిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే కీలక ఎన్నికల హామీలను అమలు చేయడం రేఖాగుప్తా సర్కార్‌కు కత్తిమీద సామే. ఇదే సమయంలో ఢిల్లీ నగరంలో మౌలిక వసతుల కల్పన, యమునా నది ప్రక్షాళన బీజేపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్యలు.

మొదట ఎన్నికల హామీలపై దృష్టిపెడతామని రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పూర్తి నిజాయితీతో, అంకితభావంతో పనిచేస్తానని నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు చెల్లించే పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉంది. ఇది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అత్యంత కీలకమైన పథకం.

అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సి ఉంది. ఉచితంగా మంచినీటి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కొత్త ప్రభుత్వం కల్పించాలి. ఢిల్లీలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించాల్సి ఉండగా మరో రూ.5 లక్షలు అదనంగా ఖర్చు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

కాగా యమునా నది ప్రక్షాళన బీజేపీ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్​! కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని ప్రక్షాళన చేయడం అంటే మాటలు కాదు. దశాబ్దకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు యమునానదిని పట్టించుకోలేదని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ హోరెత్తించింది. అధికారంలోకి రాగానే యమునానదిని శుద్ధి చేస్తామని ప్రధాని మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ హామీ ని నిలుపుకోవాల్సిన బాధ్యత రేఖా గుప్తా సర్కార్ పై ఉంది. కాగా ఢిల్లీలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్యాన్నంగా తయారైంది. దీంతో ఆయా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత నూతన సర్కార్‌పై ఉంది. అలాగే ఢిల్లీలో ఇటీవలికాలంలో తరచూ మంచినీటి కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించడంలో దశాబ్దకాలం పాటు అధికారం చెలాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ చేతులెత్తేసింది. ఢిల్లీ వాసులకు ఎండాకాలంలోనూ మంచినీటి కొరత లేకుండా చూడాలి.

ఢిల్లీ నగరం అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది వాయు కాలుష్యం. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కొత్త విషయం కాదు. అనేక సంవత్సరాలుగా రాజధానీ నగర ప్రజల ఆరోగ్యంతో పొల్యూషన్ చెలగాటమాడుతోంది. తొలిసారిగా 2018 నవంబరులో ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయికంటే 2018 లో ఎక్కువ రేంజ్‌లో కాలుష్యం నమోదైంది. దీంతో, ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఎయిర్ పొల్యూషన్‌కు ప్రతీకగా నిలుస్తోంది ఢిల్లీ నగరం. ఇబ్బడిమబ్బడిగా పెరిగిన గాలికాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం పది సంవత్సరాలు తగ్గిపోతోందని అమెరికాకు చెందిన ఒక రీసెర్చ్ గ్రూప్ కొంతకాలం కిందట జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. దీంతో, హస్తినలో గాలి కాలుష్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలికాలుష్యం హానికర స్థాయిని మించిపోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. ఒకదశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్‌లో ఉన్నట్లేనని సాక్షాత్తూ ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించిందంటే పొల్యూషన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన నూతన ప్రభుత్వం పై ఉంది.

రాజకీయంగానూ రేఖా గుప్తా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపొందించడంలో ఆప్ సర్కార్ విజయం సాధించిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ మెరుగైన వసతులతో ఉన్నాయంటే, అది ఆప్ సర్కార్ కృషే. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్ లు కూడా సూపర్ డూపర్ గా సక్సెస్ అయ్యాయి. బస్తీ వాసుల్లో కేజ్రీవాల్ కు ఇప్పటికీ గుడ్ విల్ ఉందంటే…అందుకు కారణం మొహల్లా క్లినిక్ లు. వీటిని కొనసాగించాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉంది. అంతేకాదు వీలైతే మొహల్లా క్లినిక్ లను మరింత బలోపేతం చేయాలి.

కాగా కేంద్రంలో ఉన్నది ఎన్డీయే సర్కార్ కాబట్టి, రేఖా గుప్తా ప్రభుత్వానికి నిధుల కొరత అనేది ఉండకపోవచ్చు. కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు తెచ్చుకుని ప్రజల ఆశలకు తగ్గట్టు పారదర్శకంగా పరిపాలన చేయాల్సిన బాధ్యత రేఖా గుప్తా సర్కార్ పై ఉందన్నది వాస్తవం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్