గొంగడి త్రిష.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఇటీవలి వరకు క్రికెట్ అంటే అబ్బాయిల పేర్లే వినిపించేది. కానీ ఇప్పుడు క్రికెట్‌లోనూ యువతులు, మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. అందులోనూ తెలుగమ్మాయి గొంగడి త్రిష క్రికెట్‌లో సత్తా చాటడమే కాకుండా.. ఇటీవల జరిగిన మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిచింది. దీంతో ఆమె పేరు ఏపీ, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీమిండియా భారత్ చేరుకుంది. మలేషియా నుంచి నేరుగా బెంగళూరు వచ్చింది టీమిండియా. అక్కడి నుంచి తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, గ్రీతి కేసరి శంషాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో HCA అధ్యక్షులు జగన్మోహన్ రావు ఘనంగా స్వాగతం పలికారు. ఇండియా ఉమెన్ క్రికెట్‌కి ఈ విజయం బూస్టప్ వంటిదన్నారాయన.
మలేషియాలో జరిగిన మెగా టోర్నమెంట్‌లో ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది భారత్. ఈ విజయంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. త్రిష అద్భుత బ్యాటింగ్‌తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శన క్రికెడ్ అభిమానులను ఆకట్టుకుంది. ఫైనల్లోనూ 44 పరుగులు చేసి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
టోర్నమెంట్ మొత్తం ఆమె 77.25 సగటుతో 309 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రకటించిన టోర్నమెంట్ బెస్ట్ టీమ్‌లో గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత క్రీడాకారిణులు స్థానం సంపాదించారు.
త్రిషకు మిథాలీ రాజ్ అంటే అభిమానం. వరల్డ్ కప్‌లో ఓపెనర్ పాత్రకు సంపూర్ణ న్యాయం చేసింది. గత ఎడిషన్‌లో కప్పు నెగ్గిన జట్టులో ఉన్నప్పటికీ త్రిషకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే తాజా టోర్నీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వంద శాతం కృషి చేశానని త్రిష అంటోంది. మెగా టోర్నీలో తనకు లభించిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశానని… ఈ విషయంలో సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉన్నానని అంటోంది.