స్వతంత్ర వెబ్ డెస్క్: భారత రెజ్లర్ల సమాఖ్య(WFI) మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న రెజ్లర్లు తమ నిరసనను మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమయ్యారు. తాము సాధించిన పతకాలను గంగా నదిలో వేస్తామని తెలిపారు. మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా? దేశం తరఫున పతకాలు ఎందుకు సాధించామా? అని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. పతకాలను తిరిగి ఇవ్వడం తమకు మరణంతో సమానమని కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం ఇంకా కష్టమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి, ప్రధానికి పతకాలను తిరిగి ఇచ్చేద్దామన్నా మనసు ఒప్పుకోవడం లేదు.. ఎందుకంటే వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. అందుకే ఇవాళ సాయంత్రం హరిద్వార్ వద్ద పవిత్ర గంగా నదిలో వాటిని కలిపేయనున్నామని వెల్లడించారు. అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టంచేశారు. కాగా ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఇకపై జంతర్ మంతర్ వద్ద దీక్షకు అనుమతించబోమని హెచ్చరించారు.