స్వతంత్ర వెబ్ డెస్క్: ఏదైనా సాధించాలనే తపన ఉండాలే గానీ ఏ పని చేసినా తప్పులేదు. అంకితభావంతో పనిచేస్తే విజయం దానంతట అదే వస్తోంది. ఇందుకు నిదర్శనంగా ముంబైలోని ఇద్దరు కుర్రాళ్లు నిలిచారు. ముంబైలోని లోఖండ్ వాలా బ్యాక్ రోడ్డులో ఇద్దరు కుర్రాళ్లు టీ అమ్ముతూ ఉంటారు. అయితే వీరి గురించి తెలిసిన వాళ్లు మాత్రం ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎందుకంటే వీరు లగ్జరీ కారు అయినా ఆడిలో వస్తారు. వేడి వేడి ఛాయ్ అక్కడే తయారుచేసి విక్రయిస్తుంటారు. ఛాయ్ అమ్మడం అవ్వగానే దర్జాగా ఆ కారులో తిరిగి వెళ్లిపోతారు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
ఆడి కారులో వచ్చే వారు ఇలా రోడ్డు పక్కన టీ అమ్మడం ఏంటని షాక్ అవుతున్నారు. అయితే వీరు ఇలా చేస్తుంది డబ్బులు లేక కాదట.. పార్ట్ టైమ్ ఆదాయం కోసమట. అమిత్ కాశ్యప్, మను శర్మ అనే ఇద్దరు స్నేహితులు కలసి ఈ స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడి కారు ఉన్నా ఛాయ్ అమ్మడం ఏంటా? అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఏ పని చేసైనా డబ్బు సంపాదించేందుకు సిగ్గు ఎందుకని మరికొందరు చెబుతున్నారు. వ్యాపారవేత్తలుగా కావాలనుకునే వారికి ఈ కుర్రాళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.