ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యంవైపు చూస్తున్నాయని… మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని చెప్పారు. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయన్నారు చంద్రబాబు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయని చెప్పారు. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోందన్న సీఎం.. సూక్ష్మ నీటిపారుదల విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. చీడపీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయని వివరించారు. మామిడిపంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయని చెప్పారు. డ్రోన్ల ద్వారా చీడపీడలు గుర్తించే సాంకేతికత వచ్చిందని పేర్కొన్నారు. పశువులకు ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తామని చెప్పారు.
గడ్డి పెంచే క్షేత్రాల సంఖ్య పెంచుతామని చంద్రబాబు అన్నారు. పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని తెలిపారు. తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేస్తామన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని.. భవిష్యత్తులో సెల్‌ఫోన్ మీకు ఆయుధంలా పనిచేస్తుందని వివరించారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తామని వెల్లడించారు. విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ నాలెడ్జ్ పెంచుకునేందుకు చూడాలని చంద్రబాబు తెలిపారు.