కుప్పంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా.. అవసరమైతే అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, విజ్ఞప్తులను చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఫిర్యాదుల స్వీకరణకు జననాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రజలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అదే విధంగా వాట్సప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. వాటిని పోర్టల్‌లో నమోదు చేసి అనంతరం విశ్లేషించి.. సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. కుప్పం నియోజకవర్గం విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా తనపై ప్రత్యేక బాధ్యత ఉందని… ఇక్కడి ప్రజలు వరుసగా 8 సార్లు తనను గెలిపించారని అన్నారు. ముఖ్యమంత్రి అయినందున బాధ్యత ఎక్కువగా ఉంటుందని.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు అన్నారు.