తెలుగు రాష్ట్రాల్లో బుక్‌ల గోల రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన నారా లోకేశ్.. రెడ్ బుక్ అంటూ ఊదరగొట్టారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న వారి పేర్లను నోట్ చేసుకుంటున్నామని.. అధికారుల జాతకాలు సైతం రాసుకుంటున్నామని.. అధికారంలోకి రాగానే అందరి సంగతి తేలుస్తామని అన్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక వారు కూడా తాము అధికారంలోకి వచ్చాక రివేంజ్ తీర్చుకుంటామని బెదిరించారు కూడా. ఇదేవిధంగా తెలంగాణలోనూ పింక్ బుక్ అంటూ ఇప్పటికే మొదలుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఏం జరిగినా పింక్ బుక్‌లో రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బుక్ బయటకు తీసి ఒక్కొక్కరి లెక్కలు సరిచేస్తామని ఆమె కూడా ఇప్పటికే బెదిరించారు.
తాజాగా మరోసారి పింక్ బుక్‌ను ప్రస్తావించారు కవిత. నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పై ఆమె ఫైరయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మెయింటెన్ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారామె.
కవిత మాట్లాడుతూ.. ” పింక్ బుక్‌లో అందరి చిట్టా రాసుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది అప్పుడు అందరి సంగతి చెప్తాం. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారు. చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదు.
కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారు. తమ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారు. ఇదేమి రాజ్యం…? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు…? . కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారు. సన్న వడ్లకు బోనస్ అని చెప్పి భోగస్ చేసిన ప్రభుత్వం.. రైతు భరోసా,రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా ఇవ్వలేదు”…అని కవిత అన్నారు.