రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన దూకుడును రెట్టింపు చేశాడు. కనిపించిందంతా దోచేసుకుంటాం అంటూ సామ్రాజ్యవాద ధోరణి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్ ల్యాండ్, పనామా కాల్వలను లాక్కుంటామని హెచ్చరిస్తున్న ట్రంప్.. తాజాగా ఇజ్రాయిల్ దాడుల్లో మరుభూమిగా మారిన గాజాను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. అక్కడి పాలస్తీనా పౌరులు అందరూ తమ సొంత భూమిని వదలుకొని ఇతర ప్రదేశాలకు వెళ్లిపోవాలని సూచించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు సమర్థించగా హామాస్ తీవ్రంగా ఖండించింది.
గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పాలస్తీనియన్లు అందరూ వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా యాజమాన్యం తీసుకొని దాన్ని పునర్నిర్మిస్తుందని చెప్పారు. యుద్ధంలో భాగంగా అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన అంత్యంత ప్రమాదకరమైన బాంబులు, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను అమెరికా తీసుకుంటుందని అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గాజా వాసులకు గాజా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టే తిరిగి వారు శిథిలమైన ఆ ప్రాంతానికి వెళ్తున్నారని ట్రంప్ చెప్పారు. గాజాలో ధ్వంసమైన నిర్మాణాలను సరి చేసి వివిధ కార్యక్రమాల ద్వారా ఆర్థిక అభివృద్ధి ఉపాధిని సృష్టిస్తామన్నారు. అంతకుముందు కూడా పాలస్తీనియన్లు గాజా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ట్రంప్ సూచించారు. దీంతో గాజాను పునర్నిర్మించిన తర్వాత అక్కడ నివసించేందుకు పాలస్తీనియన్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా.. లేదా ఇతరులకు అక్కడ ఆశ్రయం కల్పిస్తారా.. అన్నది ట్రంప్ చెప్పలేదు. డెన్మార్క్ కు చెందిన గ్రీన్ ల్యాండ్, పనామాకు చెందిన పనామా కాలువ, ఇప్పుడు గాజా.. ఇలా కనిపించినదానల్లా స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్న ట్రంప్ ఆలోచన సామ్రాజ్య విస్తరణ కాంక్షను ప్రతిబింబిస్తుందని విమర్శలు వస్తున్నాయి.
గాజాను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఈ ఆలోచనపై శ్రద్ధ వహించాలన్న నేతన్యాహు.. చరిత్రను ఈ నిర్ణయం మలుపు తిప్పుతుందన్నారు. ఇజ్రాయెల్‌కు అతి పెద్ద మిత్రుడు ట్రంప్ అని నెతన్యాహు కొనియాడారు. పాలస్తీనియన్లను తమ సొంత భూభాగం నుంచి వెళ్లిపోమని సాక్షాత్తు అగ్రరాజ్యం అధినేత చెప్పడం మధ్య ప్రాంతంలో పెను కలకలం సృష్టిస్తోంది. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు గాజా రాజకీయ విభాగం హమాస్ స్పష్టం చేసింది. మారణ హోమం, భారీ వలసలు దురాక్రమణలు వంటి భారీ నేరాలకు పాల్పడ్డ ఇజ్రాయెల్ జిజయోనిస్టులను శిక్షించకుండా తిరిగి దానికే రివార్డులు ఇస్తున్నారని ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఏజెన్సీ నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి పాలస్తీనా శరణార్థులకు అమెరికా మానవతా సాయన్ని అందించబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే జెనీవా పనిచేసే కేంద్రంగా మానవ హక్కుల మండలి నుంచి అమెరికా వైదొలిగింది. పాలస్తీనా శరణార్థులకు సాయం అందించే ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సంస్థ హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా ఉంటుందని ఇజ్రాయెల్ ఆరోపించడంతో అప్పటి బైడెన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఇజ్రయెల్ ఆరోపణలను అప్పుడే ఖండించింది ఇప్పటికే యునెస్కో నుంచి వైదొలగాలని అలాగే ఐరాసాకు నిధులు ఆపేయాలన్న ప్రతిపాదనను సమీక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా ఐక్యరాజ్య సమితి సాధారణ నిర్వహణ బడ్జెట్‌లో 22 శాతం చెల్లిస్తోంది. తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఐరాసా దాని సామర్థ్యానికి అనుగుణంగా నడుచుకోవడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు.