‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిర్మాతలు, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. నిర్మాతల నమ్మకం నిజమై మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. షో షోకి వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా కనిపించలేదు. అంతలా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడం కోసం మీడియా ముందుకి వచ్చాము. థాంక్స్ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.” అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి, “నాగవంశీ గారు ఈ సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే వంశీ చెప్పారు.. సినిమాకి ఎక్కడైనా నెగటివ్ కామెంట్ వస్తే అడగండని. అయితే ఈస్థాయి స్పందన లభిస్తుందని నేను కూడా ఊహించలేదు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకి ఎంతో మంచి టాక్ వచ్చింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా ఇంత మంచి పేరు రావడమనేది చాలా అరుదైన విషయం. ఈ సినిమా పట్ల మీడియా మద్దతుకి, ప్రేక్షకుల ఆదరణకి చాలా చాలా థాంక్స్. పండగ అయినా కూడా మొదటిరోజు మంచి వసూళ్లు రావడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తుంది. మలయాళం ప్రేక్షకులు దీనిని డబ్బింగ్ సినిమాలా చూడటంలేదు. సొంత సినిమాగానే భావిస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే తేడా లేకుండా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ దేవుని ఆశీస్సులతోనే సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభిస్తోందని నమ్ముతున్నాను.” అన్నారు.
నటుడు రాజ్ కుమార్ కశిరెడ్డి మాట్లాడుతూ, “దుల్కర్ సల్మాన్ గారి స్నేహితుడి పాత్ర కోసం వెంకీ గారు నన్ను తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కసిరెడ్డి కొత్తగా కనిపించాడు అని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంది. అదే సమయంలో.. నా స్నేహితులు, తెలిసినవాళ్ళు సినిమా చూసి, ఫోన్ చేసి.. ముందు నా పాత్ర గురించి మాట్లాడట్లేదు. దర్శకుడు సినిమా అద్భుతంగా తీశాడని చెబుతున్నారు. సినిమా చూసి ఒక దర్శకుడి గురించి అలా మాట్లాడటం అనేది, నిజంగా గొప్ప విషయం.” అన్నారు.
ఈ సందర్భంగా మీడియా నుంచి ఎదురైన పలు ఆసక్తికర ప్రశ్నలకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి సమాధానమిచ్చారు.
దర్శకుడు వెంకీ అట్లూరి:
– బ్యాంకింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది. ప్రేమకథలు చేసే నేను, కాస్త భిన్నంగా సందేశాత్మక సినిమా చేద్దామని ‘సార్’ కథ రాసుకోవడం జరిగింది. ఈసారి ఇంకా విభిన్నంగా ఏదైనా చేద్దామనుకున్నాను. ఆ ఆలోచన నుంచే ‘లక్కీ భాస్కర్’ కథ పుట్టింది.
– యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి ఆదరణ లభిస్తోంది. ఇంకో ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఇందులో ఫైట్లు లేకనప్పటికీ, మాస్ ప్రేక్షకులు ఈ సినిమా నచ్చిందని చెబుతున్నారు. సినిమాలో హీరో గెలిచిన ప్రతిసారీ తామే గెలిచినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. అదే ఈ సినిమాకి ఇంతటి స్పందన రావడానికి కారణమైంది.
– బ్యాంకింగ్, షేర్స్ గురించి కొంత రీసెర్చ్ చేశాను. మా నాన్నగారి స్నేహితుడు కుటుంబరావు గారికి వీటిపై అవగాహన ఉంది. ఆయనతో కలిసి కొన్నిరోజులు ట్రావెల్ చేసి, వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకొని కథలో పొందుపరిచాను.
– సంభాషణలకు మంచి పేరు వస్తుండటం సంతోషంగా ఉంది. మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారి స్ఫూర్తితోనే నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నా సంభాషణల్లో త్రివిక్రమ్ గారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
– దుల్కర్ గారు స్టార్ అయినప్పటికీ, ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకునే సన్నివేశం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు ఆ సన్నివేశానికి అంత మంచి పేరు రావడానికి కారణమే ఆయనే.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ:
– తెలుగులో కొత్త జానర్ సినిమా చేశాము. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మొదటిరోజు కలెక్షన్లు చాలా బాగా వచ్చాయి. విడుదలైన ప్రతి చోటా కలెక్షన్లు బాగున్నాయి. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను రాబడుతుంది.
– విడుదలకు ముందే ‘లక్కీ భాస్కర్’కి నెగటివ్ రివ్యూలు రావని నేను నమ్మకం వ్యక్తం చేశాను. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది.
– ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కసిరెడ్డి నటన, డైలాగ్ డెలివరీ నచ్చింది. అప్పటినుంచే అతనికి మా బ్యానర్ లో అవకాశం ఇవ్వాలి అనుకున్నాము. లక్కీ భాస్కర్ రూపంలో అది కుదిరింది.
– బాలకృష్ణ గారి ‘NBK 109’ టీజర్ మరియు విడుదల తేదికి సంబంధించిన అప్డేట్ ను వారం రోజుల్లో ఇస్తాము. ప్రస్తుతం మా బ్యానర్ లో పలు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక భారీ రాజకీయ నేపథ్యమున్న సినిమా చేసే ఆలోచన ఉంది.