సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి మరీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు.
అనంతరం శాంతమ్మ వంటింట్లోకి వెళ్లి స్వయంగా గ్యాస్ స్టవ్ వెలిగించి, టీ తయారు చేశారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాందెడ్ల మనోహార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి ఆయన ఆ టీని సేవించారు. సీఎం చంద్రబాబు తమ ఇంటికే వచ్చి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయడంతో శాంతమ్మ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. శాంతమ్మ కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. తర్వాత ఒంటరి మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పెన్షన్ డబ్బులు అందజేశారు. ఒంటరి మహిళకు ఇల్లు కట్టించి ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో పాటు ఇంటి నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఇటీవలి ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. కూటమి ప్రభుత్వం రావడంతో సూపర్ ఆ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీపం 2 పథకంలో భాగంగా కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే అందజేస్తుంది. తద్వారా పేదలపై గ్యాస్ భారం తగ్గుతుంది. ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.