చత్తీస్ గఢ్ రక్తమోడింది. చత్తీస్ గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా అనేక మంది జవాన్లు గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే మందు పాతర పేలిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. గాయపడ్డవారిని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పేల్చివేతకు మావోయిస్టులు పక్కా ప్లాన్ వేశారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్, కుత్రు అటవీ ప్రాంతంలోని ఒక మార్గం దగ్గరకు రాగానే మావోయిస్టులు అప్రమత్తమయ్యారు. వెంటనే మందుపాతర పేల్చివేశారు. దీంతో పెద్ద శబ్దంతో మందుపాతర పేలింది.
కాగా కొంతకాలంగా చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అనేకమంది మావోయిస్టులు చనిపోయారు. దీనికి కౌంటర్‌గా కుత్రు అటవీ ప్రాంతంలో మందు పాతర పేల్చివేశారు మావోయిస్టులు.
ఇదిలా ఉంటే మావోయిస్టుల తాజా దాడిని, పిరికి పందల చర్యగా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి అభివర్ణించారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని వదిలే ప్రసక్తేలేదన్నారు. మావోయిస్టుల వల్లనే ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదన్నారు ఆయన. ఈ సందర్భంగా 2026 నాటికి దేశవ్యాప్తంగా మావోయిజాన్ని అణచివేస్తామని కేంద్రహోమ్ మంత్రి అమిత్ షా చెప్పిన మాటను విష్ణుదేవ్ సాయి గుర్తు చేశారు. అమిత్ షా సంకల్పం నెరవేరాలని తాను కోరుకుంటున్నట్లు విష్ణుదేవ్ సాయి పేర్కొన్నారు. జవాన్ల త్యాగం వృధా కానివ్వమన్నారు ఆయన.