పార్టీ నుంచి వెళ్లి పోతున్న వైసీపీ నాయకులపై , మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. తనలో ఎలాంటి భయం లేదు కాబట్టే నిర్భయంగా రాజ్యసభ పదవిని, రాజకీయాలను వదిలేశానని చెప్పారు.
ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి..” వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని కాబట్టే ప్రలోభాలకు లొంగలేదు. నాలో భయం అనేది లేదు, కాబట్టే రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ పదవులను రాజకీయాలను సైతం వదులుకున్నాను”.. అని చెప్పారు.
గురువారం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నుంచి వెళ్లిపోయే వారికి విశ్వసనీతయ ఉండాలని అన్నారు. ప్రలోభాలకు లొంగి, భయపడి, లేక రాజీపడి వెళ్లిపోతే.. విశ్వసనీతయ అనేది ఎక్కడిది?..రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని.. ఐదేళ్లు కష్టపడితే తిరిగి తాము అధికారంలోకి వస్తామని అన్నారు. విజయసాయిరెడ్డికైనా.. మిగిలిన వారికైనా ఇదే వర్తిస్తుందని జగన్ అన్నారు.
ఇక విజయసాయిరెడ్డి స్టేట్‌మెంట్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. మూడేళ్లు పదవీకాలం ఉండి కూడా భయం లేక ప్రలోభాలకు లొంగకపోతే రాజీనామా ఎందుకు చేసినట్టు?.. అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు మాట్లాడని వైసీపీ నేతలు.. తమ అధ్యక్షుడికి కౌంటర్ ఇవ్వడంతో ఆయనను టార్గెట్ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే రాజీనామా చేసి వైసీపీ నుంచి వచ్చిన విజయసాయిరెడ్డి.. తాను వ్యవసాయం చేసుకుంటానని.. ఏ పార్టీలోనూ చేరనని చెప్పారు. అయితే తర్వాత నుంచి బీజేపీపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. రోజుకో ట్వీట్ చేస్తూ కమల దళాన్ని ఆకాశానెత్తడం చూస్తుంటే.. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా..? అని సందేహాలు కలుగుతున్నాయి.