మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తికావొస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే గత వారాంతం ఎఫెక్ట్‌తో 350 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచి ట్రాఫిక్‌లో భక్తులు అవస్థలు పడ్డారు. వీటన్నింటిని దృష్టిలోపెట్టుకొని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్‌గా మారుస్తామని వెల్లడించారు.
శని, ఆదివారాల్లో లక్షల మంది కుంభమేళా యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రహదారి పైనే వాహనంలో ఉండిపోవాల్సి వచ్చింది. జబల్‌పుర్-ప్రయాగ్‌రాజ్ మార్గంలోని జాతీయరహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్‌లో చూసుకుంటూ ముందుకుసాగాలన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఇక, ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి నిన్న రాత్రి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పోలీసులు, అధికారులు సమావేశమయ్యారు. రోడ్లపై వాహనాలు భారీగా చేరకుండా చూడాలని… రద్దీ లేకుండా చూసుకోవాలన్నారు. పార్కింగ్ ప్రాంతాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఆ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిని దృష్టిలో ఉంచుకొని మాఘ పూర్ణిమ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.