హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీ ఓపెన్ చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. రోహిత్ వేముల కేసును రీ ఓపెన్ చేయడంపై ఆమె రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీ ఓపెన్ చేస్తామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. రోహిత్ తల్లి కొంతమంది పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరతామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మొద్దన్న ఆయన.. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.రోహిత వేముల ఆత్మహత్య 2016లో దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో నిన్న మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న రోహిత్ వేముల కేసు విచారణను క్లోజ్ చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు పోలీసులు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడగా దానికి ఎవరూ కారణం కాదని తేల్చారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లను సైతం పోలీసులు జోడించారు.అయితే తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. అంతేకాదు. రోహిత్ వేముల కుటుంబానికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను కూడా ఫోర్జరీ చేశారని, రోహిత్ దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని చెప్పారు. దళిత విద్యార్థులపై HCU అధికార యంత్రాంగం వైఖరి నిరసిస్తూ రోహిత్ వేముల ఆందోళనలు చేయగా, యూనివర్సిటీ నిబంధనలకు లోబడే అప్పటి వీసీ చర్యలు తీసుకున్నారని కూడా రిపోర్టులో స్పష్టం చేశారు పోలీసులు. దాంతో ఈ కేసులో నిందితులుగా పలువురు బీజేపీ నేతలతోపాటు హెచ్‌సీయూ వీసీ అప్పారావు ఉపశమనం లభించింది. అయితే పోలీసుల రిపోర్ట్‌పై కింది స్థాయి కోర్టులో అప్పీలు చేసుకో వచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


