తెలుగు సినిమాల్లో రాజకీయ కలర్ ఉండటం ఇప్పుడు కొత్తేమీ కాదు. అలనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు ఎన్టీ రామారావు సినిమాల్లో చాలాసార్లు రాజకీయ డైలాగులు పడుతూ ఉండేవి. తర్వాత ప్రజారాజ్యం కాలంలో చిరంజీవి కూడా ఇదే ట్రెండ్ ఫాలోఅయ్యారు. తాజాగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా రాణిస్తున్న బాలక్రిష్ణ.. ఇప్పుడు ఈ బాధ్యత చేపట్టారు. అందుకే సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో వరుసగా పొలిటికల్ డైలాగులు పడుతూ వచ్చాయి.
వీరసింహారెడ్డి సినిమాను ప్రధానంగా రాజకీయ అవసరాల కోసమే తీశారన్న మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులు విమర్శలు చేసేటప్పుడు వాడే డైలాగుల మాదిరిగా అనిపిస్తున్నాయి.

- వీరసింహారెడ్డిలో బాలక్రిష్ణ వాడిన డైలాగులు కొన్ని చూద్దాం…
- రాజకీయాల మీద బతికే మనిషిని కాదు.. రాజకీయాల్ని మార్చే మనిషిని నేను.
- నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.
- ప్రగతి సాధించటం అభివృద్ధి అవుతుంది కానీ, ప్రజల్ని వేధించటం కాదు..
- జీతాలు ఇవ్వటమే డెవలప్మెంట్ కానీ, బిచ్చమెయ్యటం కానే కాదు..
- పనిచేయటం అభివృద్ది, పనులు ఆపడం కానే కాదు..
- నిర్మించటమే అభివృద్ధి కానీ, భవనాలు కూల్చడం కాదు
ఇలాంటి డైలాగ్ లు చాలా వరకు తెలుగుదేశం నాయకులు తరచు వినిపిస్తూ ఉంటారు. వీటిని వాడటం ద్వారా వైసీపీ ప్రభుత్వం మీద బాలక్రిష్ణ పంచులు వేశారని అర్థం అవుతుంది. పనిలో పనిగా రాయలసీమ గొప్పతనాన్ని చెబుతూ మరికొన్ని డైలాగులు వేశారు. సీమలో పరపతి కోసమో, పెత్తనం కోసమో తాను పనిచేయటం లేదని చెప్పారు. ముందుతరాలు తనకు ఇచ్చిన బాధ్యత ఇదని చెప్పారు. పైగా రాయలసీమ మీద తనకు చాలా అఫెక్షన్ అని బాలక్రిష్ణ చెప్పుకొచ్చారు. మొత్తం మీద వైసీపీకి చురకలు వేస్తూ, రాయలసీమ మీద అభిమానాన్ని ఉంచుతూ వీరసింహారెడ్డి సినిమా సాగిపోయింది.

మొత్తం మీద ఈ డైలాగుల పరంపర చూస్తే రాయలసీమలో గత వైభవాన్ని సాధించాలన్నది బాలక్రిష్ణ ఆలోచన అని అంటున్నారు. తద్వారా తెలుగుదేశం అక్కడ బలపడేందుకు తనవంతు ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారన్న మాట కూడా వినిపిస్తోంది.
