స్వతంత్ర వెబ్ డెస్క్: ‘పీఎం -ఈ బస్ (PM-E-BUS)’ సేవ పేరుతో సరికొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 97 వేల 613 కోట్ల ఖర్చుతో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు. పథకం కింద మొత్తం10 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric bus)కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది.
169 నగరాలు, పట్టణాల్లో ఛాలెంజ్ పద్ధతిలో ఈ బస్సులను అందజేయనున్నారు. దీని ద్వారా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు కాలుష్య రహిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
గ్రీన్ మొబిలిటీ కింద100 పట్టణాలను ఛాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. రూ. 97 వేల కోట్లలో రూ. 20 వేల కోట్లు మాత్రమే కేంద్రం చెల్లిస్తుంది. మిగతా డబ్బులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
5 లక్షల లోపు జనాభా కల్గిన పట్టణాలకు 100 బస్సులు, 5 లక్షలపైబడి 20 లక్షల లోపు జనాభా కల్గిన పట్టణాలకు 150 బస్సులను అందజేయనున్నారు. బస్సుల కొనుగోళ్లకు పీపీపీ పద్ధతిలో కంప్యూటర్ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. పీపీపీ పద్ధతిలో ముందుకొచ్చే సంస్థలకు పదేళ్లపాటు ప్రతి కిలోమీటర్ లెక్కన కేంద్రం నుంచి సహాయం అందుతుంది.