ఏళ్ల తరబడి ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు ఏపీ సీఎం వై.ఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అలాగే..ఇక్కడి ప్రజలకు సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు సీఎం.
ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశానన్నారు వై.ఎస్ జగన్. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చామని తెలిపారాయన. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందిస్తామన్నారు ఏపీ సీఎం వై.ఎస్ జగన్.
గత ప్రభుత్వ హయాంలో ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం. అసలు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబుకు, ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఎందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదల ప్రాణాలంటే టీడీపీ అధినేతకు లెక్కే లేదని మండిపడ్డారు వై.ఎస్ జగన్.
ఇక, దత్తపుత్రుడంటూ పవన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు సీఎం జగన్. ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారని, తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారని విమర్శించారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. బాబు ఇంకో పార్ట్‌నర్ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్‌కల్యాణ్‌కి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
అటు.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నీటి పారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదంటూ ఆరోపించారు.
పొలిటికల్ విమర్శల సంగతి ఎలా ఉన్నా… ఉద్దానంలో తమకోసం రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి అందుబాటులోకి రావడంపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.