మంగళగిరి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లోకి చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరిపోయారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్యెల్యే ఈదర హరిబాబులకు అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు భీమిలికి చెందిన వైసీపీ నేతలు శ్రీచంద్రరావు, దివాకర్ తదితరులు కూడా జనసేన కండువా కప్పున్నారు. కాగా టీవీ రామారావు 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014,2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. వైసీపీలో గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. ఇక ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో జడ్పీ చైర్మన్ గానూ విధుల నిర్వర్తించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న హరిబాబు.. ఇప్పుడు జనసేనలో చేరడం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.