స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేరికకు తాత్కాలిక బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు లేట్ అవుతాయన్న వార్తల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల సందర్భంగా ఈ నెల 16 లేదా 17న తుమ్మల కాంగ్రెస్లో చేరే అవకాశం లేదని తెలుస్తున్నది. దీనికితోడు 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభకానున్నాయి. జమిలి ఎన్నికలపై ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న క్రమంలో.. పార్లమెంట్ భేటీ కంప్లీట్ అయ్యేదాకా వేచి చూడాలని తుమ్మల అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాలేరు సీటు విషయంలో కూడా కాంగ్రెస్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడం, ఖమ్మం లేదా ఇంకో సీటు సూచిస్తుండటంతో వెయిట్ అండ్ సీ అనే భావనకు తుమ్మల నాగేశ్వర రావు వచ్చినట్లు తెలుస్తున్నది. పాలేరు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్లో చేరాలని, లేదంటే ఇండిపెండెంట్గా అయినా బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
బుజ్జగించే ప్రయత్నాలు చేయని బీఆర్ఎస్
బీఆర్ఎస్లో పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల అసంతృప్తిగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ కేటాయించడం, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, కనీసం పిలిచి మాట్లాడకపోవడం వంటి కారణాలతో ఆయన పార్టీకి దూరమయ్యారు. ఇంత వరకు బహిరంగంగా పార్టీ మార్పుపై తుమ్మల ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క వేర్వేరుగా వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వాళ్లతో తుమ్మల చెప్పారు. బీఆర్ఎస్కు తుమ్మల రాజీనామా చేయకపోయినా, ఆ పార్టీ వైపు నుంచి బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరగలేదు. పార్టీ టికెట్ల ప్రకటన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన టైమ్లో బీఆర్ఎస్ జెండా గానీ, ఎవరి ఫొటోలు లేకుండా భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఏది ఏమైనా.. బీఆర్ఎస్ వీడే ఆలోచనలో ఉన్న తుమ్మల.. రాజకీయ భవిష్యత్తుపై ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు.