- ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధర రూ.1,600
- గోదావరి పరిసరాలు, బొగ్గుగనులు, ఓపెన్ కాస్ట్ సందర్శనకు అనుమతి
ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు బయల్దేరేలా ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కొత్త టూరిజం ప్యాకేజీని రెడీ చేసింది. సింగరేణి దర్శన్ పేరిట ప్రాణహిత, గోదావరి లోయ పరిసర ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రాంతంలో 350 కి.మీ మేర విస్తరించిన సింగరేణి గనుల సందర్శనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని మంగళవారం ఆర్టీసీ ప్రకటించింది. ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధరను రూ.1,600గా నిర్ణయించింది సింగరేణి దర్శన్ ప్యాకేజీలో భాగంగా.. భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, జైపూర్ పవర్ ప్లాంట్ రెస్క్యూ స్టేషన్లను దర్శించవచ్చు. భోజన సదుపాయం కూడా ఆర్టీసీనే కల్పిస్తుంది. ఈ ప్యాకేజీని కోసం ఎంజీబీఎస్ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లలో సంప్రదించవచ్చు. సింగరేణి దర్శన్ బస్సులు ఈ బస్‌స్టేషన్ల నుంచే బయల్దేరేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.