స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పరిణామాలు చూసి తట్టుకోలేక ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారనే వార్తలు రావడంపై లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ జగన్ కక్ష పూరిత చర్య అని ఇప్పటికే దేశమంతా గుర్తించిందన్నారు. అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. అధారాలు లేని కేసుతో వైసీపీ ఆడుతున్న డ్రామాకు త్వరలో తెరపడుతుందన్నారు. ప్రజలు ఎవరూ భావోద్వేగాలకు లోనుకావొద్దని, అంతా క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో అక్రమ కేసుల విషయంలో జగన్ ప్రభుత్వ పైత్యం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని లోకేశ్ అన్నారు. అధినేత అరెస్టుపై శాంతి యుత నిరసనలు చేసిన వారిపైనా హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జగన్ ఫ్రస్టేషన్‌కు, భయానికి నిదర్శనమన్నారు. శ్రీకాళహస్తిలో నిన్న సామూహిక నిరాహార దీక్షకు దిగిన 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్ కు పంపించడంపై లోకేశ్ మండి పడ్డారు. నిరాహార దీక్షలకు, దిష్టబొమ్మ దహనాలకు కేసులుపెట్టి రిమాండ్ కు పంపే పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేదన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రజల్లో ఉన్న ఆవేదన, ఆగ్రహం బయటకు కనపడకుండా చేయడానికే ఈ అక్రమ కేసుల కుట్రలు అని ఆరోపించారు. పసుపు జండా చూసినా… పసుపు దళం గళం విన్నా జగన్ కు వెన్నువణుకుతోందన్నారు. అందుకే నియంత నిర్ణయాలతో టీడీపీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.