అమెరికా తన వాణిజ్య భాగస్వాములతో ఢీ అంటే ఢీ అంటోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ప్రజల జీవన వ్యయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపుతో అమెరికన్లు ఆ భారం మోయక తప్పదని అంటున్నారు. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా సరుకులపై 25 శాతం టారిఫ్ విధించారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10 శాతం సుంకాలు విధించారు. ఈ మేరకు ట్రంప్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఫెంటానిల్ రవాణా, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇక ట్రంప్ చర్యతో ఆ దేశ ద్రవ్యోల్బణం పెరగనుంది. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, అమెరికన్ల కష్టాలు రెట్టింపు అవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా.. ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తామూ 25శాతం టారిఫ్ విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్‌పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ చర్యకు ఇతర దేశాలూ స్పందిస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్రంప్ తాజా చర్యపై కెనడా ప్రధాని ట్రూడో విచారం వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలూ పోరాడిన సంగతి గుర్తుచేశారు. కార్చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడినప్పుడు తాము అండగా నిలిచామని తెలిపారు. తాము చేసిన సాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో 3 వేలకోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలినవాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నీచర్ సహా పలు ఉత్పత్తులు 25శాతం సుంకం పరిధిలోకి వస్తాయని చెప్పారు.