- మైనంపల్లి, కృష్ణారావు, వివేక్, భేతి సుభాష్, అరికెపూడి గాంధీ ఆగ్రహం
- మేడ్చల్ జిల్లా పదవులన్నీ మంత్రి అనుచరులకే ఇస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తీరు పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు మైనంపల్లి, కృష్ణారావు, వివేక్, భేతి సుభాష్, అరికెపూడి గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి ఇంటిలో భేటీ అయిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో పదవులన్నీ మంత్రి తన అనుచరులకే ఇప్పిస్తున్నారని ఆరోపించారు. తాము భేటీ అవుతున్న విషయం ఎవరికీ చెప్పలేదని, మంత్రి మల్లారెడ్డి అందరితో కలిసి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు.
అయితే.. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంటుకు పోటీ చేయాలని మైనంపల్లి భావిస్తున్నారు. తన కుమారిడికి అసెంబ్లీ సీటుకోసం ప్రయత్నిస్తున్నారు. అయితే మల్లారెడ్డి మాత్రం తన అనుచరులకే సీట్లు ఇప్పించుకుంటున్నారని మైనంపల్లి గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు.
మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్యే మైనంపల్లితో మల్లారెడ్డికి విభేదాలు బహిర్గతమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా మైనంపల్లి నివాసంలో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇతర ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయొద్దని మల్లారెడ్డి కలెక్టర్ కు చెప్పాడని అసమ్మతి ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తాము చేపట్టే పనులకు మంత్రి అడ్డుతగులుతున్నాడని ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని తన మనిషికి ఇప్పించుకున్నారని ఎమ్మెల్యే వివేక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అసంతృప్త ఎమ్మెల్యేలను తనవద్దకు రావాలని స్వయంగా కేసీఆర్ పిలడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్ మారింది.