స్వతంత్ర వెబ్ డెస్క్: నిన్న ఒడిశాలో జరిగిన ప్రమాదం దశాబ్ద కాలంలో జరగలేదు. అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మాటలకందని మహా విషాదం. ఈ ఘటనలో 233మంది మృత్యు ఒడిలో చేరగా.. 900మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ 900మందిలో కొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారు మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాద ఘటనలో కుప్పలుగా మృతదేహాలు, క్షతగాత్రుల తెగిపడిన శరీర అవయవాలు భీకర వాతావర్ణాన్ని తెలియ చేస్తుంది. ఒకవైపు మృతి ఒడికి చేరిన బాధిత కుటుంబాల రోదనలతో శోకసంద్రంగా మారగా.. మరోవైపు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సైరన్లతో బాలేశ్వర్ హోరెత్తుతోంది. అసలు ఇంత ఘోరం ఎలా జరిగింది.. దీనికి కారణం ఎవరు..?
ప్రమాదం ఎలా జరిగిందంటే..
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అమితాబ్ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు. అయితే ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు.
తాజా దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కాసేపట్లలో ఒడిశా సీఎం నవీన పట్నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్రం మొత్తం సంతాప దినంగా ప్రకటించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, వాయుసేన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నటున్నాయి. ఈ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.


