కొత్తగా పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. ఆ నవ వధువు ఏం చేసిందంటే, భర్త అత్తమామలతో కలిసి దేవాలయానికి వెళ్లింది. చక్కగా పూజలు చేసింది. భోజనాలకు ముందు వాష్ రూమ్ కి వెళ్లాలని చెప్పి భర్త దగ్గర రూ.10 తీసుకుంది. ఇంతకీ రాదు, అంతకీ రాదే… గంట సేపైనా రాలేదు. అత్తామామలు, భర్త కంగారు పడ్డారు. ఏమైపోయిందంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు.
భర్త వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణ మొదలైంది. దేవాలయం దగ్గర, ఇంకా చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో పుటేజీలు తీసి చూస్తే అసలు విషయం తెలిసింది. పెళ్లి కూతురు తాపీగా నడుచుకుంటూ గుడి బయటకు వచ్చింది. అక్కడే ఒక రెడ్ బైక్ పై అప్పటికే రెడీగా ఉన్న ప్రియుడితో కలిసి పరారైపోయింది.
ఇవన్నీ చూసిన అత్తమామలు, భర్త అవాక్కయిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగింది. జౌన్ పూర్ కి చెందిన యువకుడికి, అజంఘడ్ కి చెందిన అమ్మాయితో ఫిబ్రవరి 10న వివాహమైంది. పదిరోజుల తర్వాత పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వింధ్య వాసిని దేవాలయానికి వెళ్లారు. అప్పుడే ఈ అనుకోని ఘటన జరిగింది.
ఆ అమ్మాయి భర్త ఫిర్యాదు చేయలేదని, చేస్తే తప్పకుండా విచారించి వారెక్కడికి వెళ్లింది? ఎక్కడ ఉన్నది కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లికూతురి తల్లిదండ్రులే పడతారని వీళ్లూ లైట్ తీసుకున్నారని చెబుతున్నారు.